ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా రాజకీయ పార్టీల్లో వుండాలి. అధికారం తమదే అనే విశ్వాసం వుండాలి. ఇంత వరకూ ఓకే. కానీ ఫలితాలు రాకుండానే, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవడం చూసే వారికి విడ్డూరంగా కనిపిస్తుంది. 2024లో ఏపీ అధికారంపై ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై వుంది. ఎన్నికల కౌంటింగ్‌కు గట్టిగా 8 రోజుల సమయం వుంది.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నానికి ఏపీ అధికారి ఎవరిదో స్పష్టమవుతుంది. అప్పటి నుంచి ప్రమాణ స్వీకారానికి ఎన్ని రకాలుగా అయినా ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ వైసీపీ మాత్రం ఎందుకో అత్యుత్సాహం ప్రదర్శిస్తోందనే భావన జనాల్లో ఏర్పడుతోంది. విశాఖలో 8 లేదా 9వ తేదీన సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ముఖ్యనేతలు కూడా ప్రమాణ స్వీకారం తేదీలు, ముహూర్త సమయాన్ని కూడా మీడియాకు చెప్పడం గమనార్హం. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా ఉన్నప్పటికీ, ఏమంత ఆత్రుత అనే అభిప్రాయం వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా వ్యక్తమవుతోంది. నాల్గో తేదీ వరకూ వేచి చూడలేరా? విజయాన్ని అందుకున్న తర్వాత ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.
అందుకు విరుద్ధంగా ఫలితాలు వెల్లడి కాకముందే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అంటూ ఓవరాక్షన్ చేయడం అవసరమా? అనే ప్రశ్న సొంత పార్టీ నుంచి కూడా వ్యక్తమవుతోంది. టీడీపీ బెట్టింగ్‌ల గురించి తప్పు పడుతూ, మరోవైపు వైసీపీ పెద్దలు కూడా అదే రీతిలో ప్రమాణ స్వీకారం పేరుతో హడావుడి చేయడం విమర్శకు దారి తీస్తోంది. ఈ విషయం కాస్త ఆలోచించి, వైసీపీ సంయమనం పాటించాల్సిన అవసరం వుంది. నాల్గో తేదీ విజయం సాధించిన తర్వాత ఎన్ని విద్యలైనా పడొచ్చు.