మోడీ చాలా బాధపడుతున్నాడట..!

ప్రధాని నరేంద్ర మోడీ తాను చాలా పడుతున్నానని చెప్పారు. దేనికి బాధ? ఆరోగ్యం బాగాలేదా ? ఇన్నేళ్ళలో ఆయన అనారోగ్యం పాలయ్యాడని, హాస్పిటల్లో చేరారని ఎప్పుడూ వినలేదు. కాబట్టి ఆయనకు ఆరోగ్య సమస్యల బాధలేదు.…

ప్రధాని నరేంద్ర మోడీ తాను చాలా పడుతున్నానని చెప్పారు. దేనికి బాధ? ఆరోగ్యం బాగాలేదా ? ఇన్నేళ్ళలో ఆయన అనారోగ్యం పాలయ్యాడని, హాస్పిటల్లో చేరారని ఎప్పుడూ వినలేదు. కాబట్టి ఆయనకు ఆరోగ్య సమస్యల బాధలేదు. కుటుంబం లేదు కాబట్టి వారసుల బాధలు లేవు. వాళ్ళతో వచ్చే సమస్యలు లేవు. ఆస్తిపాస్తులకు సంబంధించిన బాధలు లేవు. ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. డబ్బు తినేశాడని, కబ్జాలు చేశాడనే ఆరోపణలు లేవు. కాబట్టి దానికి సంబంధించిన బాధలు లేవు.

మరి ఆయన దీనికి బాధపడుతున్నాడు? తనకు ఒకటే ఒక బాధ ఉందని చెప్పారు. అదేమిటంటే …ఈ దేశంలో సరైన ప్రతిపక్షం లేదట. బలమైన ప్రతిపక్షం లేకపోవడం పెద్ద లోటేనని అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయిగానీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలేదని అన్నారు. ప్రతి నిర్ణయాన్ని తప్పుబట్టి గొడవ చేస్తున్నాయని అన్నారు.

కానీ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని మోడీ నిజంగా  కోరుకుంటున్నారా? అసలు నిజంగా బలమైన ప్రతిపక్షం ఉంటే అధికారంలో ఉన్న పార్టీ సహిస్తుందా ? బలమైన ప్రతిపక్షం ఉండాలని మోడీ కోరుకుంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ఎందుకు అంటున్నారు ? కాంగ్రెస్ మీద అంతగా ఎందుకు చెలరేగిపోతున్నారు? ఎందుకు చీల్చి చెండాడుతున్నారు?

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఏర్పడిన ప్రభుత్వాల్లో బలమైన ప్రతిపక్షం ఉండాలని అప్పటి పాలకులు కోరుకున్నారు. ప్రతిపక్షాలని గౌరవించేవారు. చట్ట సభల్లో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు. వారితో సంప్రదింపులు, చర్చలు జరిపేవారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసమే ఆలోచించేవారు. అధికార పక్షం, ప్రతిపక్షాలను రాజకీయ ప్రత్యర్థులుగా చూసేది తప్ప రాజకీయ శత్రువులుగా భావించేది కాదు. అపోజిషన్ పార్టీస్ కూడా ఇదే తరహాలో వ్యవహరించేవి.

కానీ ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అలాంటి వాతావరణం ఎక్కడా లేదు. ఎక్కడిదాకో ఎందుకు? తెలుగు రాష్ట్రాల్లోనే గత పదేళ్లలో ప్రభుత్వాలు  ప్రతిపక్షాలను ఎలా అణగదొక్కాయో చూసాం. తెలంగాణలోగానీ, ఏపీలోగానీ అసెంబ్లీలో ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద చర్చలు జరిగిన దాఖలాలు ఉన్నాయా? ప్రతిపక్షాలు ఉండకూడదని పాలక పార్టీలు బహిరంగంగానే చెప్పాయి.

ప్రతిపక్షాలని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులను కూడా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నాయి. మోడీ కూడా ఇదే టైపు. తెలంగాణా బీజేపీలో పార్టీలో చేరికల కోసమే కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి కమిటీలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు.

ఇలాంటి నేపథ్యంలో బలమైన ప్రతిపక్షం లేదని మోడీ చెప్పడంలో అర్థం లేదు. పాలక పార్టీలు ప్రతిపక్షాలను బతకనిస్తే కదా. బీజేపీ కూడా ఒకప్పటి విలువలకు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చింది. ఆ పార్టీకి కూడా రాజకీయ ప్రయోజనాలే ప్రధానమయ్యాయి. అందుకే పార్టీ అధ్యక్షుడు నడ్డా వాజపేయి, అద్వానీ కాలం నాటి బీజేపీ వేరు, ఇప్పటి బీజేపీ వేరు అని ఉంటారు.