ఎన్నికల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన షర్మిల ప్రయాణం ఇంత వరకూ సాఫీగానే సాగింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ మార్క్ సినిమాను ఆమెకు చూపనున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శే నిదర్శనం. ఇంతకాలం షర్మిలపై మాట్లాడకుండా కాంగ్రెస్ నేతలు బలవంతంగా నోళ్లు మూసుకున్నారు.
ఎన్నికల తంతు ముగియడంతో షర్మిల అహంకారం, ఒంటెత్తు పోకడపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడానికి కాంగ్రెస్ నేతలు కాచుక్కూచున్నారు. తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికలో షర్మిల ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్ నేతలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానురీతిలో షర్మిల వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. అభ్యర్థలకు టికెట్లు ఇచ్చే విషయంలోనూ డబ్బులు చేతులు మారడంపై ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. షర్మిలపై గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక, ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతల అప్పగింతపై ఈ ఇద్దరు నాయకులే అధిష్టానం వద్ద అడ్డు చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు.
చింతా మోహన్‌కు మొదటి జాబితాలో ఎంపీ సీటు ప్రకటించలేదు. ఇది కూడా ఆయన ఆగ్రహానికి కారణం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే ఓట్ల శాతం షర్మిల రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. నాలుగైదు శాతం ఓట్లు వస్తే షర్మిలకు గౌరవం దక్కుతుంది. లేదంటే ఆమెకు కాంగ్రెస్‌లో కౌంట్‌డౌన్ మొదలైనట్టే.