వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో జవహర్‌రెడ్డిని సీఎస్‌గా తప్పించాలని కూటమి నేతలు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. సీఎస్‌గా జవహర్‌రెడ్డిని తప్పించడానికి సహేతుక కారణాన్ని ఎన్నికల కమిషన్‌కు కూటమి నేతలు చూపలేకపోయారు.
కనీసం కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే సమయానికైనా ఆయన్ను తప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆశ కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనపై అవినీతి మరక వేయడానికి చిల్లరమల్లర నాయకులతో నిరాధార, సంచలన ఆరోపణలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో జవహర్‌రెడ్డి 800 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశాడంటూ జనసేన నాయకుడితో తీవ్ర ఆరోపణ చేయించారు.
చేతిలో సర్వాధికారులు ఉన్నప్పటికీ… ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డం సాధ్యమా? అనే కనీస ఇంగితం లేకుండా ఆరోపణలు చేయడం వారికే చెల్లింది. ఈ ఆరోపణలపై సీఎస్ జవహర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సదరు వ్యక్తి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని గట్టిగా హెచ్చరించారు.
సీఎం జగన్‌కు దన్నుగా నిలిచారని భావిస్తే, అధికారులైనా, నాయకులైనా ఎల్లో మీడియా టార్గెగ్ అవుతున్నారు. తాడు బొంగరం లేని నాయకులతో విమర్శలు చేయించడం, వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ఎల్లో మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. జహవర్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు తెగబాధపడుతున్నారు.
వ్యవస్థల సహకారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విస్మరించినట్టున్నారు. ఎన్నికల కమిషనే తమ చేతల్లో వుందని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నమ్ముతున్నప్పుడు సీఎస్ జవహర్‌రెడ్డి ఏం చేయగలరు? సీఎస్ అంటే ఎందుకంత భయం? ఎన్నికల కమిషన్‌ను కాదని సీఎస్ చేయగలిగేది ఏముంటుంది? ఒకవేళ చేస్తే ఆ పోస్టులో ఒక్క క్షణం కూడా వుండలేరని చంద్రబాబునాయుడికి బాగా తెలుసు.
2019లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావును నిఘా విభాగాధిపతిగా సీఎస్ తప్పించలేదు. దీంతో సీఎస్‌నే ఎన్నికల కమిషన్ తప్పించిన సంగతి చంద్రబాబుకు తెలుసు. ఆ అనుభవాల నుంచి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఏం నేర్చుకున్నట్టు? గుడ్డ కాల్చి సీఎస్‌పై వేస్తే, దాన్ని తుడుచుకోలేక సతమతం అవుతాడని ఆ ఇద్దరు నాయకుల ఉద్దేశం. అయితే తనపై నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తిపై పరువు నష్టం దావా వేయడానికి జవహర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.
ఆరోపణలే కదా అని ఊరికే ఉండడానికి ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు. మంచి అధికారిగా గుర్తింపు పొందారు. అందుకే లోకేశ్ తన విభాగంలో ఆయన్ను నియమించుకున్న విషయాన్ని మరిచిపోవద్దు. తమకు అనుకూలంగా లేకపోతే చాలు… ఎవరిపై అయినా నిందలు వేయడం అలవాటుగా పెట్టుకున్న వైనం విమర్శలకు దారి తీస్తోంది. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదని గ్రహిస్తే అందరికీ మంచిది.