ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ అప్పుడప్పుడు యోగి వేమనలా మారిపోతుంటాడు. లోకమంతా చెడిపోయిందని, తాను, తన పత్రిక, చానెల్ పరమ పవిత్రులని నమ్ముతూ నీతి శతకం బోధిస్తూ వుంటాడు. జర్నలిస్టులంతా ఎర్నలిస్టులని, కూలి మీడియా అని ఈ ఆదివారం కొత్త పలుకు పలికారు.
ఎర్నలిస్టులు అనే మాటలో ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ఎర్నలిస్టులకి ఆదిపురుషుడు ఎవరనేది ప్రశ్న. కూలి మీడియా కూడా నిజమే. మీ దగ్గర వెట్టి చాకిరి చేసిన వారికి, చేస్తున్న వారికి మీరెంత కూలి ఇచ్చారో, ఇస్తున్నారో అందరికీ తెలుసు. నీతి నిజాయితి భగభగ పొంగే మెయిన్‌స్ట్రీమ్‌లో కూలి గిట్టుబాటు కానప్పుడు, ఎక్కువ కూలికి పని చేయడం న్యాయమే కదా!
సందు దొరికితే చాలు, సోషల్ మీడియాపై నిప్పులు కక్కే ఆర్కే తన పత్రికలో ఎడిషన్ ఇన్‌చార్జ్‌లకి (వాళ్ల అనుభవం కనీసం 20, 30 ఏళ్లు) ఇచ్చే జీతమెంతో తెలుసా రూ.30 వేలు లేదా రూ.35 వేలు. సబ్ ఎడిటర్లకి (10-15 ఏళ్ల అనుభవం) రూ.20 వేల నుంచి రూ.25 వేలు. హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటో చేసే వాళ్లకి కూడా ఇంతకంటే మంచి జీతం వస్తుంది. మరి గౌరవ జర్నలిస్టులు ఎర్నలిస్టులు, కూలీ మీడియాగా అయినా మారాలి లేదా ఆకలితో చావాలి. అందరికీ ఎర్నలిజం సాధ్యమైతే తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 ఆంధ్రజ్యోతి పత్రికలుండాలి. ఉన్నాయా?
పత్రికల్లో నష్టాలొస్తాయి కాబట్టి జీతాలివ్వలేం అంటారు. మరి నష్టాలే వస్తే ఈ 20 ఏళ్లలో యజమానుల సంస్థానాల విలువ ఎంత? జర్నలిజం చెడిపోయింది. ఎవరికీ సందేహం లేదు. కానీ ఈ వైరస్‌ని వదిలిన సైంటిస్ట్‌ల్లో రాధాకృష్ణ కూడా ప్రముఖుడు కదా! దేవతా వస్త్రాలు ధరించి ఇతరుల నగ్నత్వాన్ని చూసి నవ్వే వాళ్లని ఏమంటారు?
ఆయన బాధ ఏమంటే గతంలో పత్రికలు రాసిందే వేదం. ఇప్పుడు ఎవరూ వాటిని నమ్మడం లేదు. సోషల్ మీడియాని పూర్తిగా నమ్ముతున్నారంటే అదీ లేదు. శుద్ధ వాస్తవం ఇప్పుడు లేనేలేదు. అబద్ధ వాస్తవమే వుంది. జగన్‌కి అనుకూలంగా ఎక్కువ మంది అంచనాలు కట్టడం ఆర్కేకి కోపం. చంద్రబాబు ఉవ్వెత్తున గెలిచిపోతుంటే ఎందుకీ ఆత్మ వంచన అని ప్రశ్న. కాకపోతే ఆయన గతం మరిచిపోతారు. 2019లో చంద్రబాబు మళ్లీ గెలుస్తారని జోస్యం చెప్పారు కదా! దాన్ని ఏ రకం వంచన అనాలి?
కనీస అవగాహన లేని వారు, జనం నాడి తెలియని వారు కూడా అంచనాలు రూపొందించడం ఆశ్చర్యం అని రాశారు. జనం నాడి అంటే ఏంటంటే సర్వకాలాల్లో చంద్రబాబు భజన.
ఎవరెన్ని అంచనాలు వేసినా ఈవీఎంలు మారవు – ఎవరో ఒకరు గెలుస్తారు. చంద్రబాబు గెలిస్తే ఆంధ్రజ్యోతికి హఠాత్తుగా అద్భుతాలు కనిపించడం స్టార్ట్ అవుతుంది. మార్క్సిజం, లెనినిజంలా గురివిందిజం అనే పదం కొత్తగా పుట్టింది. గతంలో నాయకులకు మాత్రమే ఉన్న ఈ జబ్బు ఇపుడు అందరికీ సోకింది. తాము మాత్రమే నిజాయితీపరులమని, ప్రజాక్షేమం కోరే వారిమని, తమది కొత్త పలుకు అని భ్రష్టు పట్టిన సమాజానికి దివ్య ఔషధాన్ని అందించడానికే తాము ఉన్నామని నమ్ముతూ నీతులు చెబుతూ వుంటారు.
రాధాకృష్ణ నయా గురివిందిస్ట్.