జ‌ర్న‌లిజం విలువల‌పై ఎర్న‌లిస్టు నీతిసూక్తులు

ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు శీర్షికన రాసే వ్యాసంలో సీఎం వైఎస్ జగన్‌ మీద, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేవారి మీద విషం చిమ్ముతూ వుంటారు.…

ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు శీర్షికన రాసే వ్యాసంలో సీఎం వైఎస్ జగన్‌ మీద, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేవారి మీద విషం చిమ్ముతూ వుంటారు. వైసిపి మంచి పనులను కాస్త మెచ్చుకున్నా, టిడిపిని కాస్త తప్పుబట్టినా ఆయన సహించలేరు. 

ఈ వారం సిపిఎం మీద అటువంటి విషమే కక్కారు రాధాకృష్ణ. తెలకపల్లి రవి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్ త‌దిత‌ర ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు ఈ ఎన్నికల్లో వైసిపి గెలవడానికి అవకాశముందని విశ్లేషించడమే… సిపిఎంపై రాధాకృష్ణ ప్రేలాపణలకు కారణం.

‘అప్పుడుగానీ, ఇప్పుడుగానీ సీపీఎం వంటి పార్టీలతో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు జగన్‌కు ఉపయోగపడటం విశేషం. తెలుగునాట ఒకప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో సీపీఎంకే అధిక విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సీపీఎం ఉనికి కోసం వెతుక్కొనే పరిస్థితి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో కూడా సీపీఎంతో సంబంధాలు ఉన్నవారు జగన్‌రెడ్డికి అనుకూలంగా విశ్లేషణలు వదులుతున్నారు. అయితే, గత కొంత కాలంగా ఇలాంటి వారి విశ్లేషణలకు వ్యూస్‌ తగ్గిపోవడం గమనార్హం. మేధావులు, తటస్థుల ముసుగులో ఏం చెప్పినా జనం నమ్ముతారని అనుకోవడం అవివేకం’ ఇదీ రాధాకృష్ణ బాధ. 

ఆర్కే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఏ విలువలూ, వలువలూ లేకుండా జర్నలిస్టు అని ముద్ర వేసుకుని దిగంబరిగా సంచరిస్తున్న ఆయ‌న గారు విశ్వసనీయత గురించి మాట్లాడటం ఆశ్చర్యం. అదీ విప్లవాల వేగుచుక్క, ఉద్యమ సారథి అయిన సిపిఎంకు విశ్వసనీయత అనే సర్టిఫికెట్‌ను ఏ విశ్వసనీయతా లేని రాధాకృష్ణ ఇవ్వాలనుకోవడమే విడ్డూరం. 

తెలుగు పాఠక లోకంలో… జర్నలిస్టుగా రాధాకృష్ణకు, పత్రికగా ఆంధ్రజ్యోతికి ఆవగింజంతయినా విశ్వసనీయత వుందా? ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణ చేతికి వచ్చిన తొలినాటి నుంచి ఆ పత్రికను తెలుగుదేశం కరపత్రికగా మార్చిన తీరు అందరికీ తెలిసిందే. పత్రిక పేరుతో అక్ష‌రంతో వ్యభిచారం సాగిస్తున్న రాధాకృష్ణకు సిపిఎంకు సర్టిఫికెట్‌ ఇచ్చే నైతికత వుందా?

సిపిఎంకు విశ్వసనీయత లేదని చెబుతున్న రాధాకృష్ణ…తన అవసరం కోసం అదే పార్టీకి చెందిన గఫూర్‌, కందారపు మురళి వంటి వారిని డిబేట్లకు పిలిచి మాట్లాడించుకుంటున్నారు. మీది న్యూట్ర‌ల్‌ పత్రిక, న్యూట్రల్‌ టివి అని చెప్పుకోడానికి సిపిఎం నాయకులు కావాలా? మీకు నచ్చని వాస్తవాలు చెప్పినపుడు మాత్రం సిపిఎం విశ్వసనీయత లేని పార్టీ అయిపోతుందా?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు పోటెత్తి ఓట్లేశారని చెప్పుకున్న రాధాకృష్ణ మరచిపోయిన విషయం ఏమంటే…ఆ ఉద్యోగుల ఉద్యమాలకు నాయకత్వం వహించింది ఆ సిపిఎం పార్టీయేనని. టీచర్ల ఆందోళనలైనా, అంగన్వాడీలు, ఆశాల ఉద్యమాలైనా, సిపిఎస్‌ పోరాటాలైనా అన్నింటి వెనుక ఉన్నది సిపిఎం కాదా? విశ్వసనీయత లేని పార్టీ ఇటువంటి ఉద్యమాలు నడిపిందా? రాధాకృష్ణా…చేతిలో కలం వుంది కదా అని ఏదిబడితే అది రాయకూడదు. ఒక అక్షరం రాసేముందు ముందూ వెనుకూ ఆలోచించాలి.

రాధాకృష్ణ…సిపిఎంపైన మాత్రమే కాదు, తోటి జర్నలిస్టులపైనా విషం కుమ్మరించే ప్రయత్నం చేశారు. ‘ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు, జగన్మోహన్‌ రెడ్డికి లేని టెన్షన్‌ను ఈ తరహా ‘ఎర్నలిస్టులు’ ప్రదర్శిస్తుండడం విశేషం. ప్రధాన మీడియాలో కొంత కాలం పనిచేసిన వారితోపాటు ఉద్యోగం కోల్పోయినవారు చేస్తున్న హడావిడి గురించి చెప్పాల్సిన పనే లేదు’ అంటూ జర్నలిస్టులను ఎర్రలిస్టులుగా అభివర్ణించడమేకాదు…వారు చేస్తున్న పనిని తప్పుబట్టే ప్రయత్నం చేశారు.

ఈ అంశాన్ని మాట్లాడుకోవాలంటే….రాధాకృష్ణకంటే పెద్ద ఎర్నలిస్టు ఇంకెవరైనా వున్నారు. జర్నలిజాన్ని ఎర్న‌లిజంగా మార్చిన వారిలో ఆద్యుడు రాధాకృష్ణ కాదా? ఇది తెలియని జర్నలిస్టు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా వున్నారా? ‘ఆంధ్రజ్యోతి పత్రికను చంద్రబాబుకు పాదాక్రాంతం చేసిన అది పెద్ద ఎర్న‌లిస్టు ఎవరు’ అంటూ సీనియర్‌ పాత్రికేయులు విజయ్‌ బాబు చెప్పినదాంట్లో ఇసుక రేణువంతయినా తప్పుందా? పత్రికను తాకట్టు పెట్టే కదా…జర్నలిస్టుగా సైకిల్‌పై తిరిగిన రాధాకృష్ణ అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తింది!

రాధాకృష్ణ పత్రికా రంగ విలువలను ఎలా అథ:పాతాళానికి దిగజార్చారో, అక్షరాలతో ఎలా మేథోవ్యభిచారం చేస్తున్నారో, నీతి నియమాలను విలువలను ఎలా గాలికి వదిలేశారో రాస్తే పెద్ద పుస్తకమే అవుతుంది. ఇందుకు వందల కొద్దీ ఉదంతాలు ఆంధ్రజ్యోతి పత్రికలోనే దొరుకుతాయి. అటువంటి రాధాకృష్ణ జర్నలిస్టులను ఎర్న‌లిస్టులుగా అభివర్ణించడం హేయం కాదా?

ఆయన కడుపుమంటకు ఇంకా కారణాలున్నాయి. ఒప్పుడు ఆయన వద్ద పనిచేసిన వైఎన్‌ఆర్‌ వంటి వాళ్లు సొంతంగా యూట్యూబ్‌ ఛానళ్లు ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రభావంతమైన జర్నలిస్టులుగా మారారు. రాధాకృష్ణ గారి ఏబిఎన్‌ ఛానల్‌ కంటే జర్నలిస్టు వైఎన్‌ఆర్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ఎక్కువ వీక్షకులను సంపాదిస్తోంది. ఇది కూడా ఆయన కడుపుమంటకు కారణం. అందుకే ‘ప్రధాన మీడియాలో కొంత కాలం పనిచేసిన వారితోపాటు ఉద్యోగం కోల్పోయినవారు చేస్తున్న హడావిడి గురించి చెప్పాల్సిన పనే లేదు’ అంటూ హేళనగా రాసుకొచ్చారు.

ఇక రాధాకృష్ణ గారు….జర్నలిస్టులు విశ్లేషణలు ఎలా చేయాలో కూడా సెలవిచ్చారు. ‘రాజకీయ విశ్లేషణలు చేసే సమయంలో ఏదైనా సాధ్యమే అనే మౌలిక సూత్రాన్ని విస్మరించకూడదని జర్నలిజంలో బోధిస్తారు. చంద్రబాబు లేదా జగన్‌ గెలిచిపోయినట్టేనని చెప్పడం జర్నలిజం ప్రమాణాలకు అనుగుణంగా చేసే విశ్లేషణ కాబోదు. అలా జరిగితే జగన్‌ గెలవొచ్చు, ఇలా జరిగితే చంద్రబాబు గెలిచే అవకాశం ఉందని చెప్పడం వేరు. నాయకులకు అనుకూలంగా మాత్రమే విశ్లేషణలు చెప్పడం వేరు’ అంటూ సూక్తులు చెప్పే ప్రయత్నం చేశారు. మరి వైసిపి పని అయిపోయిందంటూ ఏబిన్‌, ఆంధ్రజ్యోతి చేసిన విశ్లేషణలు…సర్వేల పేరుతో చేసిన హడావుడి సంగతి ఏమిటి? అప్పుడు ఈ నీతులు, సూక్తులు గుర్తుకు రాలేదా?

‘సోషల్‌ మీడియాలో జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలంగా విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నవారు ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?’ అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాబోతున్నారంటూ ఏబిఎన్‌, ఆంధ్రజ్యోతి సర్వేలు వేశాయే…అప్పుడు చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు కదా….అప్పుడు మీ ముఖం ఎక్కడ పెట్టుకున్నారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో అధికారంలోకి వచ్ని జగన్‌ ప్రభుత్వంపై గత ఐదేళ్లుగా వికృతరూపంలో దాడి చేస్తున్నారు….ఈ ఎన్నికల్లో జగన్‌ గెలిస్తే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆ మధ్య ఒక మాట చెప్పారు…. ‘ఆంధ్రజ్యోతి ఒక పత్రికేనా….రాధాకృష్ణ ఒక జర్నలిస్టేనా…అది జర్నలిజమేనా’ అంటూ ఏకిపారేశారు. చంద్రబాబును డ‌ర్జీయెస్ట్‌ పొలిటీషియన్‌ అని చెప్పిన కెసిఆర్‌, జర్నలిస్టుల్లో రాధాకృష్ణను డ‌ర్టీయెస్ట్‌ జర్నలిస్టు& మీడియాధిప‌తి అనే రీతిగా వ్యాఖ్యానించారు. అటువంటి డ‌ర్టీయెస్ట్‌ జర్నలిస్టు రాధాకృష్ణ విశ్వసనీయత , విలువలు గురించి మాట్లాడుతుంటే… తెలుగు పాఠకులు ఫక్కున నవ్వుతున్నారు.

-న‌రేన్