నారా లోకేశ్‌కు టీడీపీ పగ్గాలు ఎంత త్వరగా ఇస్తే, అంత మంచిదని జూ.ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. లోకేశ్ నాయకత్వ సమర్థత ఏంటో లోకానికి, టీడీపీ శ్రేణులకు బాగా తెలుసని వారు అంటున్నారు. ఏదైనా గుప్పిట ఉన్నంత వరకే గప్పీ వుంటుందని వారు చెబుతున్నారు. చంద్రబాబునాయుడి వయసు పైబడిన నేపథ్యంలో టీడీపీకి నూతన నాయకత్వ అవసరం ఏర్పడింది.
లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలంటూ కొందరు నాయకులు వ్యూహాత్మకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో టీడీపీని సమర్థవంతంగా నడిపించే సత్తా కేవలం జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే వుందని ఆ పార్టీలోని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్ముతున్నారు. కానీ చంద్రబాబునాయుడి వారసుడిని కాకుండా మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే సీన్ లేదు.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదనే వాదనను కూడా బలంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా లోకేశ్‌కు పోటీదారుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పకనే చెబుతున్నారు. జూ.ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. లోకేశ్‌కు ఎంత త్వరగా టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే, అంతే వేగంగా తన సమర్థతను ఆయన నిరూపించుకుంటారనేది జూ.ఎన్టీఆర్ అభిమానుల కోరిక.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌ను ఎక్కడా తిప్పకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జనంలో చరిష్మా వుంటే లోకేశ్‌ను కేవలం మంగళగిరికే ఎందుకు పరిమితం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే పవన్‌కల్యాణ్‌పై చంద్రబాబు ఆధారపడాల్సిన ఖర్మ ఏంటని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిలదీస్తున్నారు.
ఇప్పటికిప్పుడు టీడీపీ పగ్గాలు చేపట్టాలనే ఆత్రుత తమ అభిమాన హీరో, నాయకుడికి లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. లోకేశ్‌ను టీడీపీ శ్రేణులే తిరస్కరించిన రోజు జూనియర్ ఎన్టీఆర్ ముందుకొస్తారని చెబుతున్నారు. చంద్రబాబు నీడలో లోకేశ్ వుండడం వల్ల… ఆయన వెలుగొందుతున్నట్టు కనిపిస్తున్నాడనే చర్చ నడుస్తోంది. ఈ దఫా టీడీపీ అధికారంలోకి రాకపోతే, చంద్రబాబునే పట్టించుకునే దిక్కుండదని, ఇక లోకేశ్‌ను దేకే వాళ్లుండరనేది బహిరంగ రహస్యం అని పలువురు అంటున్నారు.
చంద్రబాబునాయుడి స్థానంలో టీడీపీకి కొత్త నాయకత్వం తప్పని సరి. లోకేశ్‌కు అప్పగిస్తే, చాలా త్వరగానే తన అసమర్థతను నిరూపించుకోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నారు. అలాంటప్పుడు లోకేశ్‌ను నమ్ముకుని టీడీపీలో ఏ ఒక్కరు ఉండరనే మాట నిజం. కావున లోకేశ్‌ను మార్చాలనే ఆలోచన వచ్చినప్పుడు, తప్పని సరిగా జూ.ఎన్టీఆర్ మాత్రమే అందరి ఆప్షన్ అవుతుందనే అభిప్రాయం లేకపోలేదు.
కావున భవిష్యత్‌లో లోకేశ్‌ను పక్కన పెట్టాలంటే, ముందుగా అతను టీడీపీని నడిపించే సమర్థుడైన నాయకుడు కాదని నిరూపించాల్సి వుంటుంది. ఆ సమయం కోసమే జూ.ఎన్డీఆర్, ఆయన అభిమానులు సహనంతో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది.