అధికారం ఎందుకు అంటే ప్రత్యర్ధుల మీద కక్ష తీర్చుకునేందుకు అన్నట్లుగానే ఏపీ రాజకీయం తయారైంది. ఇది అత్యంత దురదృష్టకరం అని మేధావులూ ప్రజాస్వామ్య ప్రియులు అంటున్నారు. అయినా కూడా ఎవరూ ఎక్కడా మనసులో సైతం ఈ విషయం దాచుకోవడం లేదు, బాహాటంగానే చెబుతున్నారు. చినబాబు లోకేష్ అయితే రెడ్ బుక్ ఒకటి పట్టుకుని పాదయాత్ర చేశారు. ఆ రెడ్ బుక్ లో అందరి చిట్టా ఉందని అధికారంలోకి వస్తే సంగతి చూస్తామని ప్రతీ సభలోనూ హెచ్చరించారు.
చంద్రబాబు సభలలో కూడా ఇదే చెప్పారు. ఇంతకు ఇంతా మేము జవాబు చెబుతామని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఇపుడు తమ్ముళ్ళు అదే పాట పాడుతున్నారు. కాస్తా ఓపిక పట్టండి, జూన్ 4వ తేదీ రానీయండి మేము అధికారంలోకి వస్తాం అని తమ్ముళ్ళు అంటున్నారు.
అపుడు ఒక్కొక్కరి జాతకాలు బయటపెడతామని కూడా హాట్ వార్నింగులు ఇస్తున్నారు. మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాకా ఇదే మాట చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు అయితే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికీ జగన్ సేవలో తరిస్తున్న అధికారులకు జూన్ 4 తరువాత చర్యలు ఉంటాయని ఆయన అంటున్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలుకుతామని అన్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినపుడే వస్తాయని ఆయన అంటున్నారు.
ఇదే తీరున మరింతమంది తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా టీడీపీకి అధికారంలోకి వస్తే ఇలాగే ప్రతీకార చర్యలు ఉంటాయా అన్న చర్చకు తెర లేస్తోంది. అయిదేళ్ల పాటు ప్రజలకు మంచి చేయడం ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా మెప్పు పొందాల్సి ఉంటుంది అని హితవు చెబుతున్నారు. కానీ ఏపీలో మాత్రం రాజకీయం అలా ఉండకపోవడం బాధాకరమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.