మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తప్పుచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. సమర్థిస్తున్నాడు మంచు విష్ణు. బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమను ఆయన వెనకేసుకురావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎందుకంటే, రేవ్ పార్టీలో హేమ ఉందని స్వయంగా బెంగళూరు సిటీ కమిషనర్ వెల్లడించారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆమె బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. ఆమె మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు అందులో నిరూపితమైంది.
ఓవైపు ఇంత జరుగుతుంటే, మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోదంటూ హేమను వెనకేసుకొచ్చాడు మంచు విష్ణు. ఓవైపు పోలీసులు పక్కాగా అన్నీ చెబుతుంటే, నిర్థారించుకోకుండా ఓ అభిప్రాయానికి రావొద్దని అంటున్నాడు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ యాక్షన్ పై కూడా విష్ణు స్పందించాడు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బెంగళూరు పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించాలంట. అలా సాక్ష్యాధారాలు సమర్పిస్తే, హేమపై అసోసియేషన్ తగు చర్యలు తీసుకుంటుందట. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం పోలీసులకేంటి? తమ ఎంక్వయిరీ ఏదో తాము చేసుకుంటారు, అవసరమైతే కోర్టుకు ఆధారాలు అందిస్తారు. పోలీసులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎందుకు సాక్ష్యాధారాలిస్తారు..? ఒకవేళ మంచు విష్ణు, అధ్యక్షుడి హోదాలో అడిగితే సాక్ష్యాలు ఇస్తారేమో కానీ, పోలీసులు తమంతట తాము ఎందుకు కేసు వివరాలిస్తారు?
ప్రస్తుతం మంచు విష్ణు పెట్టిన పోస్టుపై సోషల్ మీడియాలో అతడిపై ట్రోలింగ్ నడుస్తోంది. పోలీసులు ఆధారాలు ఇచ్చేంతవరకు చర్యలు తీసుకోనని చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. హేమను ఓ తల్లిగా, భార్యగా అభివర్ణించిన మంచు విష్ణు.. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినప్పుడు ఆ విషయాలు గుర్తురాలేదా అని అడుగుతున్నారు.
దోషిగా రుజువయ్యేంతవరకు నిర్దోషిగా భావించాలంటూ మంచు విష్ణు పోస్టు పెట్టగా.. అయితే హేమ జీవితాంతం నిర్దోషే అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే, ఇలాంటి సెలబ్రిటీ డ్రగ్స్ కేసులు ఎలా నిర్వీర్యం అవుతాయో అందరికీ తెలిసిందే.