లోకేష్ కి పోటీగా టీడీపీ సీనియర్లు?

తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీయార్ పెట్టినపుడు బీసీలు ఇతర వర్గాలే కొండంత అండగా నిలిచారు. పార్టీ గెలిచిన తరువాత బంధువర్గం పక్కన చేరింది. ఎన్టీయార్ నుంచి చంద్రబాబుకు పార్టీ పగ్గాలు దక్కిన తరువాత పూర్తిగా…

తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీయార్ పెట్టినపుడు బీసీలు ఇతర వర్గాలే కొండంత అండగా నిలిచారు. పార్టీ గెలిచిన తరువాత బంధువర్గం పక్కన చేరింది. ఎన్టీయార్ నుంచి చంద్రబాబుకు పార్టీ పగ్గాలు దక్కిన తరువాత పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది అన్న విమర్శలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ ఎదుగుదలలో తమ భాగస్వామ్యాన్ని కూడా జోడించిన సీనియర్ తమ్ముళ్లు ఎంతో మంది ఉన్నారు. విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం నుంచి కింజరాపు కుటుంబం, విశాఖ నుంచి అయ్యన్న‌పాత్రుడు, తూర్పు గోదావరి జిల్లా నుంచి యనమల రామక్రిష్ణుడు వంటి వారు టీడీపీకి పునాదులుగా ఉంటూ వచ్చారు.

వీరంతా పొలిట్ బ్యూరోలో కీలకంగా ఉన్నారు. తెలుగుదేశం ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. టీడీపీ పగ్గాలు లోకేష్ కి అప్పగించాలని ఆ పార్టీలో తాజాగా డిమాండ్ ఊపందుకున్న వేళ సీనియర్ నేతలు ఆ అధ్యక్ష పదవికి తగరా అన్న చర్చ ముందుకు వస్తోంది.

తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు అండగా ఉండేది అన్న పేరు ఉంది. బీసీ నేతను జాతీయ అధ్యక్షుడిని చేస్తే బాగుంటుంది కదా అన్న సూచనలూ వస్తున్నాయి. చంద్రబాబు పార్టీ పగ్గాలు వదులుకుంటే బీసీలలో ముఖ్యులకు ఆ బాధ్యతలు అప్పగిస్తే సామాజిక సమతూకం సరిపోతుంది అని అంటున్నారు.

అంతే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీగా టీడీపీ దేశానికి రాజకీయంగా సామాజికంగా దిశా నిర్దేశం చేసినట్లు అవుతుందని అంటున్నారు. సీనియర్ల మదిలో కూడా తామెందుకు కీలక పాత్ర పోషించరాదు అన్న ఆలోచనలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబంతో సంబంధం లేని మల్లికార్జున ఖర్గేకు బాద్య‌త‌లు అప్పగించినపుడు టీడీపీ కూడా ఎందుకు అలా చేయరాదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

టీడీపీ అంటే కుటుంబ పార్టీ అన్న ముద్ర తొలగించుకునే ప్రయత్నానికి ఇదే అవకాశం అన్న వారూ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుట్టిన నారా లోకేష్ కి పగ్గాలు అప్పగించడం యూత్ నేతలకు బాగానే ఉండొచ్చు కానీ సీనియర్లకు మాత్రం అంతగా అంగీకారం కాబోదు అన్న ప్రచారం కూడా ఉంది అంటున్నారు.