భారత్ లో మరో ఘోర అగ్నిప్రమాద సంభవించింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిన ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఉన్నఫలంగా అగ్నిప్రమాదం సంభవించింది. అందులో నిర్మించిన ఓ తాత్కాలిక కట్టడం కూలిపోయింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. వేసవి శెలవులు కావడంతో పిల్లలంతా గేమింగ్ జోన్స్ కు వెళ్లారు. దీంతో మృతుల్లో ఎక్కువమంది పిల్లలు ఉన్నట్టు అంచనా.
ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా చాలామంది ఊపిరాడక చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. సరైన అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గేమింగ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, పార్టనర్ యువరాజ్ సింగ్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు. తాజా ఘటనతో గుజరాత్ అంతటా ఉన్న గేమింగ్ జోన్స్ లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని గేమింగ్ జోన్స్ ను మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రం జరిగిన ఘటనను ముందుగా చిన్న ప్రమాదంగా అంచనా వేసి పొరపాటు చేశారు. ఆ తప్పుడు అంచనానే ప్రమాదం మరింత పెద్దదవ్వడానికి కారణమైంది. మృతుల సంఖ్య పెరగడానికి కూడా ఇదే కారణం. జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం.