దిగ‌జారడానికి ఇంకా ఏమైనా వుందా పెద్దాయ‌నా?

మీడియాధిప‌తి రామోజీరావు దిగ‌జార‌డంలో త‌న‌కు తానే సాటి అని అనుక్ష‌ణం నిరూపించుకుంటున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో రామోజీరావు మీడియా ఇంత‌కాలం ముసుగేసుకున్న విలువ‌ల వ‌లువల్ని పూర్తిగా విప్పేసి, దిగంబ‌రంగా నిలిచింద‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. రామోజీ…

మీడియాధిప‌తి రామోజీరావు దిగ‌జార‌డంలో త‌న‌కు తానే సాటి అని అనుక్ష‌ణం నిరూపించుకుంటున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో రామోజీరావు మీడియా ఇంత‌కాలం ముసుగేసుకున్న విలువ‌ల వ‌లువల్ని పూర్తిగా విప్పేసి, దిగంబ‌రంగా నిలిచింద‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. రామోజీ మీడియాకు అంతోఇంతో వున్న విశ్వ‌స‌నీయ‌త కూడా ఈ ఎన్నిక‌ల పుణ్య‌మా అని తుడిచి పెట్టుకుపోయింది.

తాజాగా రామోజీ ప‌త్రిక‌లో వ‌చ్చిన ఒక వార్త‌… ఆయ‌న ప‌చ్చ‌(క్ష‌)పాత దృష్టిని ప్ర‌తిబింబించింది. తాను ఆరాధించే పార్టీకి, వ్య‌క్తికి ల‌బ్ధి క‌లిగించే అధికారుల విష‌యంలో ఒక‌లా, లేదంటే క‌క్ష క‌ట్టి అక్ష‌రాన్ని వ‌క్ర‌మార్గం ప‌ట్టించ‌డంలో త‌న‌కు మించిన వారు లేర‌ని రామోజీ నిరూపించుకున్నారు. 

“నంద్యాల‌లో అల్లు అర్జున్ ప్ర‌చారం …ఈసీ వేలు ఎస్పీ వైపు” శీర్షిక‌తో రామోజీ ప‌త్రిక క‌థ‌నాన్ని రాసింది. ఇదే ప‌ల్నాడు ఎస్పీ వ‌ర‌కు వ‌స్తే మాత్రం… ఆయ‌న చాలా నిజాయ‌తీప‌రుడు, అలాంటి స‌మ‌ర్థుడైన అధికారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశార‌ని ఇటీవ‌ల ఇదే రామోజీ ప‌త్రిక క‌థ‌నం రాయ‌డం గ‌మ‌నార్హం. ప‌ల్నాడులో మాత్రం ఈసీ, రామోజీ ప‌త్రిక వేలు …వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వైపు వుంటుంది. ప‌ల్నాడు ఎస్పీ బిందుమాధ‌వ్ త‌మ పార్టీకి అనుకూలంగా ప‌ని చేయ‌డంతో కాపాడుకునేందుకు త‌న‌కిష్ట‌మైన రాత రాసింది.

ప‌ల్నాడులో ఎన్నిక‌ల్లోనూ, ఆ త‌ర్వాత హింస చెల‌రేగ‌డానికి ఎస్పీ కార‌ణం కానే కాద‌ని బాబు రాజ‌గురువు గారి వాద‌న‌. నంద్యాల‌లో కేవ‌లం అల్లు అర్జున్ ఆక‌స్మికంగా రావ‌డం, పెద్ద సంఖ్య‌లో ఆయ‌న అభిమానులు ఎమ్మెల్యే శిల్పార‌విచంద్రారెడ్డి ఇంటి చుట్టూ గుమికూడ‌డానికి నంద్యాల ఎస్పీనే కార‌ణ‌మ‌ని ఈసీ భావిస్తోంద‌ని రామోజీ ప‌త్రిక రాసుకొచ్చింది. ఎందుకంటే నంద్యాల ఎస్పీ ర‌ఘువీర్‌”రెడ్డి”. అలాగే మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా”రెడ్డి”. సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గ‌మ‌నే కాదు, వైసీపీ వైపు ఎవ‌రున్నా వారిని టార్గెట్ చేయ‌డ‌మే రామోజీ ప‌త్రిక ఏకైక లక్ష్యం. 

మాచ‌ర్ల‌లో శాంతిభ‌ద్ర‌త‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిద‌ని రామోజీ ప‌త్రిక భావ‌న‌. ఇదే నంద్యాల‌కు వ‌స్తే మాత్రం… ఎస్పీ బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంది. ఏమ‌య్యా రామోజీ… దిగ‌జార‌డానికైనా ఇంకా ఏమైనా వుందా? ఒక్క‌సారి పాతాళం వైపు చూసుకో పెద్దాయ‌నా అంటూ స‌మాజ శ్రేయోభిలాషులు హిత‌వు ప‌లుకుతున్నారు.