ఎన్నికల ఎపిసోడ్‌లో అధికార పార్టీ వైసీపీది అరణ్య రోదనైంది. టీడీపీ అక్రమాలకు ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే కూటమి నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం… ఆగమేఘాలపై ఈసీ చర్యలు తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ ఎన్నికల కమిషన్ ఈ దఫా అభాసుపాలైందనే ఆరోపణలున్నాయి.
ఈసీ అమ్ముడుపోయిందని సీపీఐ నేతల విమర్శలను కొట్టి పారేయలేమని కొందరు అంటున్నారు. అలాంటి అభిప్రాయాన్ని కలిగించేలా ఈసీ వ్యవహరించిందనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం అవుతుండడం విశేషం. పల్నాడులో అవాంఛనీయ ఘటనలకు ఈసీ ఒంటెత్తు పోకడలే కారణమని అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
పల్నాడు పోలీస్ బాస్, ఈసీ కుమ్మక్కు కావడం వల్లే టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోగలిగిందనే విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం వుంది. పాల్వాయిగేటు ఉదంతాన్ని తీసుకుంటే… అక్కడ తమ ఏజెంట్లను బయటికి పంపి, టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని పోలీస్, ఎన్నికల అధికారుల దృష్టికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. కానీ వారెవరూ అటు వైపు తొంగి చూసిన పాపాన పోలేదు.
దీంతో రిగ్గింగ్‌కు అడ్డుకోడానికి స్వయంగా తమ నాయకుడే రంగంలోకి దిగాల్సి వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. పాల్వాయిగేటులో ఈవీఎంను విధ్వంసం చేశారని, పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ… అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని కోరకపోవడంతో అసలేం జరిగిందో సులువుగా అర్థం చేసుకోవచ్చని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
పల్నాడులో ఎన్నికల రోజు పలు చోట్ల టీడీపీ అరాచకాలను పోలీస్, ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఫోన్ చేసినా, కనీసం రిసీవ్ చేసుకోలేదని వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈసీ, పోలీస్ అధికారుల దృష్టి అంతా… ఎంత సేపూ కూటమికి రాజకీయ ప్రయోజనం కలిగించడంపై తప్ప, ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంపై లేనేలేదని ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు.
కనురెప్పే కంటిని కాటేసిన చందంగా, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ, తన బాధ్యతల్ని విస్మరించి, కూటమి సేవలో తరించిపోయిందనే విమర్శల్ని మూటకట్టుకుంది. చివరికి ఏ స్థాయిలో అంటే… మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం వీడియోను లీక్ చేసేంత. ఇదే టీడీపీ అరాచకాల్ని మాత్రం లోకానికి తెలియకుండా ఈసీ చాలా జాగ్రత్తలు తీసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.