మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప, చంద్రబాబు రాజగురువు నిద్రపోయేలా లేరు. పిన్నెల్లి అరెస్ట్‌ను ఆయన రాజకీయ ప్రత్యర్థుల కంటే, టీడీపీని నడిపించే రాజగురువు పత్రిక ఎక్కువగా కోరుకుంటోంది. ఇందుకు ఆ పత్రిక రాసే కథనాలే నిదర్శనం. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యేకు ఉపశమనం కలిగింది.
ఈ నెల ఆరో తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే పిన్నెల్లిని హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేయొచ్చు కదా? అని “ఈనాడు” గుర్తు చేయడం గమనార్హం. పిన్నెల్లిపై వరుస వ్యతిరేక కథనాలు చదువుతుంటే…. ఆయన్ను పచ్చ పత్రిక ప్రతినిధులే అరెస్ట్ చేసేలా ఉన్నారనే అనుమానం కలుగుతోందని జనాలు సెటైర్స్ విసురుతున్నారు.
బాబు రాజగురువు పత్రిక హద్దులు దాటి ప్రవర్తిస్తోందనే అభిప్రాయాన్ని అందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే అక్రమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటి కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఈనాడు పత్రిక రాయడం విడ్డూరంగా వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిన్నెల్లి ఈవీఎంను విధ్వంసం చేశాడని తెగబాధపడుతున్నా పచ్చ బ్యాచ్… మరి ఆ బూత్‌లో రీపోలింగ్‌కు ఎందుకు డిమాండ్ చేయలేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
కొన్ని గ్రామాల్లో టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడిందని, అందుకే రీపోలింగ్‌కు డిమాండ్ చేయలేదని, వారికి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతోనే పిన్నెల్లి వెళ్లి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఆగ్రహంతో విధ్వంసానికి దిగారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసీని రెచ్చగొట్టేలా ఈనాడు కథనాలు రాయడం కొత్తేమీ కాదని, తాము భుజాన మోసే కూటమికి అధికార పీఠంపై కూచోపెట్టేందుకు ఎల్లో మీడియా వికృత రాతలు అందరికీ తెలిసినవే అనే చర్చకు తెరలేచింది.
ఇదిలా వుండగా సీఐపై దాడి చేసినా చీమ కుట్టినట్టైనా లేదా? పోలీసులది స్వామి భక్తా? చేవలేనితనమా? అని తన మార్క్ రాత రాసిన బాబు రాజగురువుపై ఓ రేంజ్‌లో సెటైర్స్ పేలుతున్నాయి. ఇలాంటి కథనం రాయడం ద్వారా … ఈనాడు పత్రిక తన చంద్రబాబు భక్తిని చాటుకుందని సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. నిజాన్ని నిజంగా , నిజాయతీగా రాయడం మరిచిపోయిన ఎల్లో పత్రికకు… వైసీపీ ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందని, ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.