మాచర్ల ఎపిసోడ్ పై పవన్ వ్యూహాత్మక మౌనం!

మాచర్ల ఘర్షణలు ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. నిజానికి ఇదే తరహా సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పటికీ.. అనేక కారణాల వల్ల మాచర్ల గొడవలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పాత్ర…

మాచర్ల ఘర్షణలు ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్. నిజానికి ఇదే తరహా సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పటికీ.. అనేక కారణాల వల్ల మాచర్ల గొడవలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పాత్ర ఉండడం, ఆయన అరెస్టుకు పోలీసులు బృందాలుగా వెళ్లడం, అరెస్టు జూన్ 6వ తేదీ వరకు వద్దని కోర్టు చెప్పడం.. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారానికి హైప్ వచ్చింది.

రాష్ట్రంలో రాజకీయాసక్తి ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే.. మాచర్ల ఘర్షణలు, అక్కడి పర్యవసానాలు, పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి, చంద్రబాబునాయుడును ప్రచారం జరిగినంత కాలమూ ఆకాశానికెత్తేసిన పవన్ కల్యాణ్ గానీ, జనసేన పార్టీ గానీ.. మాచర్ల వ్యవహారంలో నోరు మెదపడం లేదు.

పవన్ కల్యాణ్ తనకు రాజకీయాల్లో క్లీన్ ఇమేజి ఉండాలనే భావిస్తున్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణల్లో ప్రధానంగా తెలుగుదేశందే తప్పు ఉన్నదని జనసేన నమ్ముతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులు తమకు అనుకూలంగా ఉండే బూత్ లలో విచ్చలవిడిగా రిగ్గింగుకు పాల్పడడం, యథేచ్ఛగా అక్రమాలు చేయడం వల్లనే.. ఘర్షణలు చెలరేగాయనేది ఒక వాదన. నిజానికి ఇది వైసీపీ వాదన అనుకోవచ్చు గానీ.. జనసేన కూడా దీనినే నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది.

పాల్వాయిగేటు బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడం కూడా.. పిన్నెల్లి దూకుడుకు నిదర్శనం అనుకోవడం కంటె, అక్కడ అప్పటివరకు జరిగిన పరిణామాలే ఆయనను అలా ప్రతిస్పందించేలా రెచ్చగొట్టాయనేది ఒక వాదన. ఆ వాదననే పవన్ కల్యాణ్ కూడా నమ్ముతున్నారని సమాచారం.

తెలుగుదేశం వారి అతిచేష్టల వల్ల మాచర్ల ఘర్షణలు చెలరేగాయని, వారి తప్పులను కూడా సమర్థించడానికి తాము పూనుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్వయంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. దీంతో.. మాచర్ల పరిధిలో కూడా జనసేన నాయకులెవ్వరూ పెద్దగా ఈ గొడవల గురించి పట్టించుకోకుండా తమకేమీ పట్టనట్టుగానే ఉంటున్నారు. తెలుగుదేశం పాపాల్లో తనకు సంబంధం లేదని సంకేతాలు ఇవ్వడానికే పవన్ ఇలా చేస్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు.