రాజుల రాజకీయానికి అగ్ని పరీక్ష

ఎన్నిక ఎన్నికకూ సీనియర్లు తప్పుకుంటున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక కుటుంబాలు రాజకీయ తెర మీద కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో రాజుల కుటుంబాలు అన్నీ టీడీపీ వైపు చేరి పోటీ చేశాయి. ఈసారి చూస్తే కురుపాం…

ఎన్నిక ఎన్నికకూ సీనియర్లు తప్పుకుంటున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక కుటుంబాలు రాజకీయ తెర మీద కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో రాజుల కుటుంబాలు అన్నీ టీడీపీ వైపు చేరి పోటీ చేశాయి. ఈసారి చూస్తే కురుపాం సంస్థానాధీశుల నుంచి టీడీపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సీన్ లో కనిపించలేదు.

మరో సంస్థానాధీశుడు అయిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ సైతం పోటీలో లేరు.  విజయనగరం జిల్లా దాకా వస్తే ఘనత వహించిన పూసపాటి సంస్థానానికి చెందిన కుటుంబ సభ్యుడు అశోక్ గజపతిరాజు ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమార్తెను విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయించారు.

బొబ్బిలి రాజుల విషయానికి వస్తే మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు తప్పుకుని తమ్ముడు బేబీ నాయనకు బొబ్బిలి నుంచి పోటీకి అవకాశం కల్పించారు. దీంతో ఇపుడు రెండు రాజు కుటుంబాలే ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగినట్లు అయింది.

విజయనగరం నుంచి అదితి గజపతిరాజు విజయం సాధిస్తే పూసపాటి వారసత్వం నెగ్గినట్లు అవుతుంది. మరింత కాలం రాజకీయాల్లో ఉనికి చాటుకుంటుంది. అలాగే బొబ్బిలి వంశీకుల నుంచి బేబీ నాయన గెలుపును సొంతం చేసుకుంటే బొబ్బిలి రాజ వంశం ప్రతిష్ట పెరుగుతుంది.

పోలింగ్ అనంతరం పరిస్థితులు చూస్తూంటే ఈ రెండు రాజవంశీకుల వారసులు టఫ్ ఫైట్ నే ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. మొదట్లో సునాయాసం అనిపించిన విజయనగరంలో రెబెల్  నేత పోటీతో టీడీపీకి డౌట్లు పట్టుకున్నాయి. బొబ్బిలిలో చివరి నిముషంలో అనూహ్యంగా వైసీపీ అభ్యర్ధి పుంజుకున్నారని వార్తలు రావడంతో ఆ ఫలితం కూడా ఆసక్తి రేపుతోంది.