లవ్ మి సినిమా విషయంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ సినిమా కోసం షూటింగ్స్ చేస్తూనే ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ను నెల రోజులు వాయిదా వేశారు. అయినప్పటికీ మళ్లీ షూటింగ్ చేయాల్సి వచ్చిందనే పుకార్లున్నాయి. అవి నిజమేనని అంగీకరించాడు హీరో ఆశిష్. తాజాగా మరో 10 రోజులు షూట్ చేసిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.
“సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంకొన్ని సీన్స్ యాడ్ అయితే మరింత బాగుంటుందని రాజు గారు చెప్పారు. ప్రమోషన్ కంటే, సినిమా బెటర్ అవ్వడం మంచిదని నిర్ణయించుకొని, మళ్లీ 10 రోజులు షూట్ చేశాం. దాని వల్ల పోస్ట్ ప్రొడక్షన్ టైట్ అయింది. ఆఖరి నిమిషంలో టెన్షన్ పడుతున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది.”
అయితే తాజాగా తాము చేసింది రీషూట్ కాదంటున్నాడు ఆశిష్. కొత్త సీన్స్ కోసం షూట్ చేశామని, దర్శకుడు ఫ్రెష్ గా కొన్ని సీన్స్ రాసి, దిల్ రాజుకు వినిపించి, షూట్ చేశామని తెలిపాడు. దిల్ రాజు పూర్తిగా తమకు ఈ ప్రాజెక్టు అప్పగించారని, తామంతా కొత్తవాళ్లం కావడంతో, సమన్వయం చేసుకొని సినిమాను పూర్తిచేసేటప్పటికి లేట్ అయిందంటున్నాడు.
లవ్ మీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు ఇందులో ఉన్నారంట. వాళ్లు ఎవరనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు. ఇది కేవలం హారర్ సినిమా కాదని, బలమైన ఎమోషన్స్ ఉన్నాయని చెబుతున్నాడు.