సాధారణంగా హిట్ సినిమాలే ఫేవరెట్స్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్లు ఎప్పుడూ తమ ఫ్లాప్ సినిమాల్ని ప్రస్తావించరు. కానీ హీరోయిన్ కాజల్ మాత్రం ఓ ఫ్లాప్ సినిమా తన ఫేవరెట్ అంటోంది. అదే బ్రహ్మోత్సవం. అవును.. మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమా తన టాప్-3 ఫేవరెట్స్ లో ఒకటని చెబుతోంది.
సత్యభామ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్, తన కెరీర్ లో తనకు ఇష్టమైన 3 సినిమాల్లో బ్రహ్మోత్సవం ఒకటని చెప్పుకొచ్చింది. నిజానికి ఆ సినిమాలో కాజల్ ది ఫుల్ లెంగ్త్ రోల్ కూడా కాదు. అయినప్పటికీ అదే తనకు ఇష్టం అంటోంది. దీనికి కారణం కూడా చెబుతోంది.
తను నిజజీవితంలో ఎలా ఉంటానో, తన రియల్ మెంటాలిటీ ఎలా ఉంటుందో.. బ్రహ్మోత్సవంలో తన పాత్ర కూడా అలానే ఉంటుందని చెప్పుకొచ్చింది కాజల్. సినిమాలో ఆ పాత్ర చూసిన ప్రతిసారి, అందులో తననుతాను చూసుకుంటానని, అందుకే బ్రహ్మోత్సవం అంటే అంతిష్టమని చెబుతోంది.
ఇక టాప్-3 ఫేవరెట్స్ లో మిగతా 2 సినిమాల విషయానికొస్తే.. తేజ దర్శకత్వంలో చేసిన సీత సినిమా తనకు బాగా ఇష్టమని అంటోంది. తన కెరీర్ లో తనకు బాగా సంతృప్తినిచ్చిన సినిమాగా సీత మూవీని చెప్పుకొచ్చింది. ఇక మూడో సినిమాగా సత్యభామ సినిమా పేరు చెప్పింది. ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ చేశానని, అందుకే తనకు సత్యభామ సినిమా గుర్తుండిపోతుందని అంటోంది.