సాధారణంగా ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు వంద లేదా 500 ఉంటుంది. మరీ కాస్ట్ లీ కార్యక్రమం అయితే ఎంట్రీ ఫీజు 2వేలు, 5వేలు ఉంటుంది. కానీ ఇది వెరీ వెరీ స్పెషల్. దీంట్లోకి అడుగు పెట్టాలంటే ఏకంగా 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రేవ్ పార్టీ.
బెంగళూరులో తాజాగా జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి కళ్లుచెదిరే వాస్తవాలు బయటపెట్టారు పోలీస్ కమిషనర్. ఈ ఈవెంట్ లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు కింద 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, అలా 150 మంది చెరో 50 లక్షలు చెల్లించి ఈ పార్టీకి హాజరైనట్టు వెల్లడించారు.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది ఎంట్రీ ఫీ మాత్రమే. లోపలకు వెళ్లిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సౌలభ్యాలు కావాలంటే ఇంకా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మాదక ద్రవ్యాలకు కూడా అదనంగా చెల్లించాల్సిందే. తాజాగా జరిగిన పార్టీకి ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ అనే పేరు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
మరోసారి కార్నర్ అయిన హేమ
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా హేమ అంశాన్ని ప్రస్తావించారు. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బెంగళూరు సిటీ కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేలా వీడియో విడుదల చేసినందుకు, ఆ కోణంలో కూడా ఆమెపై కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియోపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
మరోవైపు పోలీసుల వ్యవహారశైలిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులకు చెందిన పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదని, కొందర్ని స్పాట్ లోనే విడిచిపెట్టగా, మరికొందరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకుండా తిరిగి అప్పగించారనే విమర్శలు చెలరేగుతున్నాయి.