బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, నటులు పాల్గొన్నారనే ప్రచారంపై పోలీసుల వివరణ ఆశ్చర్యం కలిగిస్తోంది. బెంగళూరు సీపీ మీడియాతో మాట్లాడుతూ సన్‌సెట్ టు సన్ రైజ్ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీలో 150 మంది పాల్గొన్నారన్నారు.
ఈ రేవ్ పార్టీలో రాజకీయ నాయకులు పాల్గొన్నట్టు సమాచారం లేదన్నారు. ఇద్దరు నటులు మాత్రం పాల్గొన్నారని ఆయన తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. రేవ్ పార్టీకి వచ్చిన వారిలో అనుమానితుల దగ్గరి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామన్నారు. డ్రగ్స్ కొన్న వారిపై కఠిన చర్యలుంటాయని బెంగళూరు సిటీ కమిషనర్ హెచ్చరించారు.
ఇదిలా వుండగా రేవ్ పార్టీలో ఎక్కువగా తెలుగు వాళ్లు పాల్గొన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నటి హేమ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బెంగళూరు సీపీ మాత్రం సింపుల్‌గా ఇద్దరు నటులు మాత్రమే పాల్గొన్నట్టు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను ఎందుకు దాచి పెడుతున్నారనే చర్చకు తెరలేచింది.
రాజకీయ ఒత్తిళ్లతో కేసును అటకెక్కిస్తున్నారనే అనుమానాలకు బలం కలిగించేలా పోలీస్ అధికారి వివరణ వుందని అంటున్నారు. డ్రగ్స్‌కు సంబంధించి ప్రతిసారి ఏదో రకంగా కేసు పక్కదారి పట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ వాడకం తదితర అంశాలు మరుగున పడినట్టే.