ఆ ఒక్క‌డ్నీ క‌దిలించ‌క‌పోయిన కూట‌మి

కూట‌మి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డినా ఆ ఒక్క‌డ్నీ ఏమీ చేసుకోలేక‌పోయింది. ఢిల్లీ వేదిక‌గా త‌మ ప‌లుకుబ‌డంతా ప్ర‌యోగించినా ఆయ‌న్ను మాత్రం ఎన్నిక‌ల ప్ర‌క్రియ నుంచి త‌ప్పించ‌లేక‌పోయింది. కూట‌మి ప‌లుకుబ‌డి కంటే, తానే శ‌క్తిమంతుడ్ని అని నిరూపించుకున్న…

కూట‌మి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డినా ఆ ఒక్క‌డ్నీ ఏమీ చేసుకోలేక‌పోయింది. ఢిల్లీ వేదిక‌గా త‌మ ప‌లుకుబ‌డంతా ప్ర‌యోగించినా ఆయ‌న్ను మాత్రం ఎన్నిక‌ల ప్ర‌క్రియ నుంచి త‌ప్పించ‌లేక‌పోయింది. కూట‌మి ప‌లుకుబ‌డి కంటే, తానే శ‌క్తిమంతుడ్ని అని నిరూపించుకున్న ఒకే ఒక్క‌డు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన‌ప్ప‌టి నుంచి కూట‌మి ప్ర‌ధానంగా ఇద్ద‌ర్ని టార్గెట్ చేసింది. ఆ ఇద్ద‌రు సీఎస్‌, డీజీపీ. ఈ ఇద్ద‌రు ప్ర‌ధాన అధికారుల్ని త‌ప్పిస్తే, త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని కూట‌మి వ్యూహం. అస‌లు బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌దే వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారం కోస‌మ‌ని టీడీపీ నేత‌లు బాహాటంగా చెబుతున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ మొద‌లైన త‌ర్వాత ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్చేసింది.

దీంతో పొత్తు ఫ‌లాలు ద‌క్కుతున్నాయ‌ని ముఖ్యంగా టీడీపీ నేత‌లు సంబ‌ర‌ప‌డ్డారు. మ‌రోవైపు సీఎస్‌, డీజీపీల‌ను మార్చాల్సిందే అంటూ ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఇదే సంద‌ర్భంలో వ‌లంటీర్ల ద్వారా ప్ర‌తినెలా పింఛ‌న్ల పంపిణీ ఆగిపోయింది.

ఈ ఎపిసోడ్‌లో కూట‌మిని దోషిగా నిల‌బెట్ట‌డంలో ప్ర‌ధానంగా సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించార‌ని కూట‌మి నేత‌ల ఆరోప‌ణ‌. అంతా కూట‌మి నేత‌ల ఫిర్యాదు, సూచ‌న‌ల మేర‌కే సామాజిక పింఛ‌న్ల పంపిణీ చేస్తున్నామ‌ని ఈసీ, సీఎస్ తెలివిగా చెప్పారు. ఇందుకు ఆధారాల‌ను త‌మ ద‌గ్గ‌ర పెట్టుకుని , వ్యూహాత్మ‌కంగా న‌డుచుకున్నార‌ని టీడీపీ ఆరోప‌ణ‌.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల‌కు ఐదారు రోజుల ముందు డీజీపీ మార్పు జ‌రిగింది. ప‌నిలో ప‌నిగా సీఎస్‌ను కూడా మారుస్తున్నార‌ని, ఇదిగో, అదిగో అంటూ ఎల్లో మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేసింది. సీఎస్ బ‌దిలీ కేవ‌లం ప‌చ్చ మీడియాలో త‌ప్ప‌, వాస్త‌వంలో కాద‌ని ప్ర‌జ‌లు అనుకునే ప‌రిస్థితి. ఎట్ట‌కేల‌కు ఎన్నిక‌లు ముగిశాయి.

ఎన్నిక‌ల రోజు, అలాగే ఆ త‌ర్వాత కొన్ని ప్రాంతాల్లో జ‌రిగిన హింసాయుత ఘ‌ట‌న‌ల‌కు సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డే కార‌ణ‌మ‌ని టీడీపీ నేత‌లు ఇప్ప‌టికీ ఆరోపిస్తున్నారంటే, ఆయ‌న ఎంత‌గా టార్గెట్ అయ్యారో అర్థం చేసుకోవ‌చ్చు. సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌మ‌కు గోడ‌లా అడ్డుగా నిలిచార‌ని కూట‌మి నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఒక్క‌డు లేక‌పోతే ఎన్నిక‌ల‌ను మ‌రో ర‌కంగా నిర్వ‌హించుకునే అవ‌కాశం వుండేద‌ని టీడీపీ నేత‌ల అభిప్రాయం.

అధికార యంత్రాంగానికి బాస్ అయిన సీఎస్‌ను మార్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌… ఎన్నిక‌ల్లో వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారం ఆశించిన స్థాయిలో ల‌భించ‌లేద‌న్న‌ది టీడీపీ ఆక్రోశం. అలాగే సీఎస్ నివేదిక‌ల ఆధారంగా ఈసీ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం కూడా టీడీపీకి ఏ మాత్రం రుచించ‌డం లేదు. తాము ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా సీఎస్‌ను క‌దిలించ‌లేక‌పోయామంటే, ఆయ‌నెంత శ‌క్తిమంతుడు అర్థం చేసుకోవాల‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.