ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా తమ గెలుపుపై లెక్కలేసుకుంటుంటారు. ఏఏ ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఓట్లేసి వుంటారో ఆరా తీయడం సర్వసాధారణం. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల లెక్కలు వేరు కదా! కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో షర్మిలకు వివేకా కుమార్తె సునీత తోడుగా నిలిచారు.
వివేకా హత్య కేసు కేంద్రంగా అక్కాచెల్లెళ్లు ఆకాశమే హద్దుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిపై చెలరేగిపోయారు. అవినాష్‌రెడ్డి హంతకుడని, అలాంటి నాయకుడికి ఏ విధంగా సీటు ఇస్తావంటూ జగన్‌ను పదేపదే నిలదీశారు. తాను రాజన్న బిడ్డనని, గెలిపించాలని అభ్యర్థించారు.
షర్మిల, సునీత ప్రచారాల తీరు గమనిస్తే… వైసీపీ ఓటు బ్యాంక్‌ను టార్గెట్ చేశారు. వైసీపీకి అండగా నిలిచే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం షర్మిల గట్టిగా చేశారు. తాను గెలవకపోయినా ఫర్వాలేదు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్‌రెడ్డిని ఓడించి తీరాలన్న పట్టుదల షర్మిలలో కనిపించింది. వైసీపీ ఓటు బ్యాంక్‌ను చీల్చి, తద్వారా టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు అన్ని రకాల అస్త్రాలను షర్మిల ప్రయోగించారు. చివరికి తన తల్లి విజయమ్మతో కూడా తనకు ఓటు వేయాలనే అభ్యర్థన చేయించడం గమనార్హం.
ఎన్నికల ప్రచారానికి చివరి గంటలో రాహుల్‌ను కడపకు తీసుకురావడం వెనుక… ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చే ప్రయత్నం కనిపించింది. కాంగ్రెస్‌కు ముస్లిం, క్రిస్టియన్లు బాగా పడ్డాయని షర్మిల అనుకుంటున్నారు. అలాగే ఎంపీ విషయానికి వస్తే కొద్దోగొప్పో క్రాస్ ఓటింగ్ జరిగిందనే మాట వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ తన గెలుపు కంటే, అవినాష్ ఓటమికి దారి తీస్తాయని షర్మిల బలంగా విశ్వసిస్తున్నారు. తాను గెలుస్తానని షర్మిలకు ఏ మాత్రం నమ్మకం లేదు. కానీ వైసీపీని ఓడిస్తాననే ధీమా ఆమెలో వుంది. ఎన్నికల్లో షర్మిల లెక్కలే వేరనే చర్చకు తెరలేచింది.