ఇప్పుడు మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాజీబాబు గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఓటుకు రూ.5 వేలు తీసుకున్నాడనే కారణంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఓటుకు నోటు తీసుకోవడం నేరం. ఎస్ఐగా వుండి, తన ఓటును రూ.5 వేలకు అమ్ముకోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే ఓటు అమ్ముకున్నది ఖాజీబాబు ఒక్కడేనా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు, జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండానే ఉద్యోగులు తమ హక్కు వినియోగించుకున్నారా? అనే ప్రశ్నకు… సమాజం సిగ్గుపడేలా సమాధానం వస్తుంది. ఉద్యోగులు ఒకట్రెండు శాతం మినహాయిస్తే అందరూ ఓటుకు నోటు తీసుకుని తమ హక్కు వినియోగించుకున్న వారే. అయితే మంగళగిరి పట్టణ ఎస్ఐకి టైమ్ బాగాలేక, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు. సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఓటుకు నోటు కేసులో పట్టుబడి, జైలుపాలైన నాయకులు… ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అయితే స్థాయిని బట్టి మనుషుల్ని చూడడం అలవాటైంది. ప్రకాశం జిల్లాకు చెందిన కురిచేడు నివాసైన ఖాజీబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులెవరూ చేయని నేరం చేశారా? అంటే… అదేం కాదు. కానీ తానిలా పట్టుబడతానని ఆయన కలలో కూడా ఊహించి వుండరు. అంతెందుకు… ఎన్నికల నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ మేరకు ఎన్నికల ఖర్చుల్ని ఎన్నికల సంఘానికి అభ్యర్థి చూపాల్సి వుంటుంది.
అభ్యర్థులు తమకు చూపే ఖర్చుల వివరాలన్నీ సరైనవి కావని ఎన్నికల సంఘం అధికారులకు తెలియవా? అందరికీ అన్నీ తెలుసు. కానీ చట్ట ప్రకారం దొరికితేనే దొంగ… లేదంటే దొర. ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఇదే. అబద్ధాల పునాదులపై నిలిచిన సమాజంలో బతుకుతున్న పరిస్థితుల్లో… నీతి – అవినీతి; న్యాయం-అన్యాయం తదితర అంశాల గురించి మాట్లాడుకోవడం ఒక్కో సారి భలే విచిత్రంగా వుంటుంది.