ఒక హీరో 2 సినిమాలు చేయొచ్చు. అదేమంత కష్టమైన పని కూడా కాదు. కానీ ఒక దర్శకుడు, ఒకేసారి 2 సినిమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరీ ముఖ్యంగా ఒక సినిమా చేయడానికే ఏడాదికి పైగా టైమ్ తీసుకునే దర్శకులు, ఒకేసారి 2 సినిమాలు చేయడం ఇంకా కష్టం.
దర్శకుడు శంకర్ ఏకకాలంలో 2 సినిమాలు చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది. మొత్తమ్మీద కిందామీద పడి భారతీయుడు-2, గేమ్ ఛేంజర్ సినిమాల్ని కొలిక్కి తీసుకొచ్చాడు. వీటిలో గేమ్ ఛేంజర్ ఇంకా సెట్స్ పైనే ఉంది, అది వేరే విషయం.
ఇప్పుడిలాంటి పరిస్థితి ప్రశాంత్ నీల్ కు కూడా ఎదురైంది. ఎప్పుడూ ఒకే సినిమాపై ఫోకస్ పెట్టే నీల్ కు ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.
లెక్కప్రకారం ఈ నెల్లోనే సలార్-2 సినిమా సెట్స్ పైకి రాలేదు. కానీ అదింకా మొదలుకాలేదు. నీల్ ప్రస్తుతం ఆ సినిమాపైనే ఫోకస్ పెట్టాడు. అంతలోనే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్-నీల్ సినిమా ఆగస్ట్ నుంచి మొదలవుతుందనేది దాని సారాంశం.
ప్రశాంత్ నీల్ పర్మిషన్ లేకుండా ఈ ప్రకటన బయటకొచ్చే అవకాశం లేదు. కాబట్టి, ఒకేసారి 2 సినిమాలు చేయాలని ప్రశాంత్ నీల్ మానసికంగా సిద్ధపడినట్టే కనిపిస్తోంది. లేదంటే దర్శకుడిపై ఒత్తిడి పెంచేందుకు నిర్మాణ సంస్థ ఈ పని చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఏదేమైనా ఇలా ఒకేసారి 2 సినిమాలు హ్యాండిల్ చేయడం ప్రశాంత్ నీల్ కు ఫస్ట్ టైమ్. షాట్ పక్కాగా రావడం కోసం ఎన్నోసార్లు రీషూట్స్ చేసే అలవాటున్న ఇలాంటి దర్శకుడు.. 2 సినిమాలు ఒకేసారి చేయగలడా..? ఒకవేళ చేస్తే క్వాలిటీ తగ్గకుండా తీయగలడా? అనే డౌట్స్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.