కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. కమ్యూనిస్టు పార్టీలు తరచుగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం అని చెబుతుంటాయి. తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదు. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, కాంగ్రెస్ ను విమర్శించడానికే సమయం వెచ్చిస్తున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత కేటీఆర్ మీదనే ఉంది కాబట్టి ఆయన ఆ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కొంతైనా పూడ్చుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రచారంలో కేటీఆర్ గులాబీ పార్టీ ఓటమికి కారణాలు చెప్పాడు. ఓడిపోవడానికి ఒక కారణం కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమని చెప్పాడు. ఇది కొంతమేరకు సమంజసంగానే ఉంది.
ఆయన చెప్పిన మరో కారణం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవడమట. ఈ కారణమే చాలా సిల్లీగా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ గాని, పార్టీ నాయకులుగాని, మంత్రులుగాని అందరూ మాటలు కోటలు దాటించేవారే కదా. ప్రత్యేకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు గొప్ప మాటకారులు కదా. కేసీఆర్ చేతిలో పత్రిక, టీవీ ఛానల్, సోషల్ మీడియా ఉన్నాయి కదా. ఇతర మీడియాను కూడా తనకు భజన చేసేలా మలుచుకున్నారు కదా.
ఇంత అంగబలం, ఇంత మీడియా చేతిలో ఉన్నప్పుడు అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం ఏమిటి? చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిన్న కార్యక్రమం నుంచి పెద్ద బహిరంగ సభ వరకు ఆ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఈ అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఇన్ని పరిశ్రమలు పెడుతున్నాం, ఇన్ని పెట్టుబడులు తెచ్చామని ఊదర కొట్టారు కదా. మరి అదంతా చెప్పుకోవడం కాదా ?
తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని అదే పనిగా చెప్పేవారు కదా. ఇదంతా చెప్పుకోవడం కాదా ? తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగిందని ఎన్నిసార్లు చెప్పలేదు? ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని ఆ రాష్ట్రం ప్రజలు కూడా అన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో పదెకరాలు కొనొచ్చని ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. వీళ్ళు చెప్పుకోవడమే కాకుండా బయటివాళ్ళు కూడా అన్నారు కదా.
కానీ కేటీఆర్ మాత్రం చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని అంటున్నాడు. తప్పులు చేసాం కాబట్టే ఓడిపోయామని అనడంలేదు. అహంకారంతో వ్యవహరించడంవల్లనే ఓడిపోయామని చెప్పడం లేదు. అసలు కారణాలు చెప్పుకోలేక అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని అంటున్నాడు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలోనూ చేసిన అభివృద్ధిని గురించి ఊదరగొట్టారు కదా. ఇంకా ఏం చెప్పుకోవాలి ?
తమ పాలనలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాడు కేటీఆర్. పదేళ్ల పాలనలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారో లేదో తెలియదుగానీ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం వాస్తవం. పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది.