కాంగ్రెసు పార్టీలో ఉన్నన్ని ముఠాలు, అంతర్గత కుమ్ములాటలు దేశంలో మరే ఇతర పార్టీలోనూ ఉండవు. ఈ వైఖరిని ఆ పార్టీ నాయకులు చాలా చక్కగా సమర్థించుకుంటూ ఉంటారు. కాంగ్రెసులో మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, కాంగ్రెసులో మాత్రమే నాయకులకు స్వేచ్ఛ ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు బెంగాల్ పరిణామాలను గమనిస్తోంటే.. కాంగ్రెసు పార్టీలో నాయకులకు ఉండే స్వేచ్ఛ మరీ హద్దులు దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇండియా కూటమిలోకి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉంటుందా? లేదా? అనే విషయం చుట్టూ కొంతకాలంగా రాద్ధాంతం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫలితాల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపట్టే పరిస్థితి వస్తే.. తృణమూల్ కాంగ్రెస్ తరఫున వారికే మద్దతు ఇస్తాం అంటూ మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే మమతా బెనర్జీ మాటలను విశ్వసించలేం అంటూ పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ఆమె బిజెపితో కుమ్మక్కు అయ్యారని కూడా ఆరోపించారు. కానీ.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందన మాత్రం భిన్నంగా, దీదీకి సానుకూలంగా వచ్చింది. ఇండియా కూటమిలోకి టీఎంసీ వస్తుందో లేదో అధీర్ నిర్ణయించలేరని, కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను, అధిష్ఠానం నిర్ణయిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇష్టం లేనివాళ్లు బయటకు వెళ్లిపోవచ్చు అని కూడా అన్నారు.
ఇది పార్టీలో నిప్పు రాజేసింది. పశ్చిమ బెంగాల్ కాంగ్రెసులో ఖర్గే పట్ల ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీసు ఎదుట ఉండే పోస్టర్లు, హోర్డింగుల్లో ఖర్గే మొహంపై సిరాపోయడం, చెరపివేయడం జరిగింది. దాంతో పాటు టీఎంసీ ఏజంట్ అంటూ ఆయన పేరు దగ్గర రాశారు. ఈ కలకలం ఒక ఎత్తు అయితే.. ఈ పోస్టర్లలో ఖర్గే బొమ్మను చెరపివేసే పనిని టీఎంసీ వారే చేయించారని, విభేదాలు సృష్టించే కుట్రఅని అధీర్ రంజన్ ఆరోపిస్తున్నారు.
నిజానికి ఇండియా కూటమిలో ఉంటూ కాంగ్రెసు పార్టీకి తమ రాష్ట్రంలో రెండు సీట్లు మాత్రమే ఇస్తానని మమతా దీదీ అహంకారంగా ప్రకటించినప్పటి నుంచి వారి మధ్య విభేదాలున్నాయి. తీరా ఇప్పుడు కాంగ్రెసుకు పడేఓట్లు తన ఓట్ల నుంచి చీలిపోకుండా.. ఒక ఎత్తుగడలాగా.. ఆమె కేంద్రంలో ఇండియా కూటమి వస్తే టీఎంసీ మద్దతిస్తుందని ఒక బాణం వేసినట్టుగా పలువురు భావిస్తున్నారు.
అధీర్ అందుకే జాగ్రత్తపడి.. కాంగ్రెస్ ఓట్లను ఆమె కొల్లగొట్టకుండా చూసుకోవడానికి.. మమతా బెనర్జీని నమ్మలేం అని చెప్పారు. దీని వల్ల ఆ రాష్ట్రంలో ఓట్లు వేయించుకోవడమే ఇరు పార్టీల వారి లక్ష్యం. మధ్యలో ఖర్గే- ఇష్టంలేని వాళ్లు పార్టీనుంచి వెళ్లిపోవచ్చు లాంటి మాటలతో అతిగా స్పందించడం వల్లనే ఇప్పుడు పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.