నటి హేమ అప్పుడప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. ఇవాళ కూడా ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె ఓ వీడియోని విడుదల చేయడం విశేషం. అసలేం జరిగిందంటే…
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో గత రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీకి హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో యువతీయువకులు వెళ్లారు. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సంగతి పోలీసులకు తెలిసింది. పోలీసుల దాడిలో ప్రముఖులు పట్టుబడ్డారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులకు పట్టుబడిన ప్రముఖుల్లో నటి హేమ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో నటి హేమ ఉలిక్కి పడ్డారు. తాను హైదరాబాద్‌లోనే ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నానని, ఎంజాయ్ చేస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ ఆమె కొట్టి పారేశారు. అయితే రేవ్ పార్టీలో ఎవరు పట్టుబడ్డారో తనకు తెలియదని ఆమె అన్నారు. దీంతో హేమ దొరికారనే ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పడినట్టైంది.
రేవ్ పార్టీలో పాల్గొన్న 70 మంది యువకులు, 30 యువతులు ఉన్నట్టు సమాచారం. వీరిలో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే, ఎఫ్ఐఆర్ బయటికి వస్తే తెలిసే అవకాశం లేదు. పట్టుబడిన వారిలో ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, వారిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఏ మేరకు ఉంటాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.