విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు జోరుకు కళ్ళెం పడిందా అంటే భీమిలీ ఫలితం ఆ విషయం చెబుతుంది అని అంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లోనే గంటా స్పీడ్ కి బ్రేకులు పడ్డాయని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.
తనకు ఎదురులేదని అజేయుడిని అని చెప్పుకున్న గంటా 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే స్వల్ప ఓట్ల మెజారిటీతోనే బయటపడ్డారు అని గుర్తు చేస్తున్నారు. పదేళ్ళ తరువాత భీమిలీ నుంచి రెండోసారి పోటీ చేసిన గంటాకు 2014 నాటి సానుకూలత లేదని అంటున్నారు. పోలింగ్ అనంతరం వైసీపీ శిబిరం వేసుకున్న లెక్కలు చూస్తే గంటా ఓటమి తధ్యమని చెబుతున్నారు. గంటాను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు బాగానే నిలువరించగలిగారు అని అంటున్నారు.
అవంతికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి పూర్తిగా సహకారం ఈసారి లభించింది అని అంటున్నారు. బొత్స సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయడం విశాఖ పార్లమెంట్ పరిధిలో మూడున్నర లక్షల ఓట్లతో భీమిలీ అతి పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్ గా ఉండడంతో అక్కడ నుంచే నరుక్కు రావాలని బొత్స భావించారు అని అంటున్నారు.
భీమిలీలో తూర్పు కాపులు ఎక్కువ. ఓసీ కాపుగా ఉన్న గంటాను సైడ్ చేసి బీసీ కాపులు అంతా వైసీపీకే ఓటు చేసేలా బొత్స చక్రం తిప్పారని అంటున్నారు. దాదాపుగా డెబ్బై వేల ఓట్లు ఈ సామాజిక వర్గానికి ఉన్నాయని అంటున్నారు. దాంతో పాటు వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఆ పార్టీ వైపు నిలబడింది అని అంటున్నారు.
ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరినీ గెలిపించుకోవడానికి బొత్స పన్నిన వ్యూహంలో గంటా చిక్కుకున్నారు అని అంటున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత తనకు రాష్ట్రంలోనే భారీ మెజారిటీ వస్తుందని గంటా చెప్పుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు కూడా తన గెలుపు ని ఎవరూ ఆపలేరని ప్రకటించారు.
ఇద్దరి ధీమాలు ఇలా ఉంటే బొత్స వర్సెస్ గంటాగానే భీమిలీ పోరు సాగిందని దాంతో బొత్స తన వ్యూహాలను కట్టుదిట్టంగా అమలు చేసి ఫలితాన్ని వైసీపీకి అనుకూలం చేసేలా ప్రయత్నించారు అని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో గంటా గెలుస్తారా అంటే గెలిచినా మెజారిటీ బహు స్వల్పం అనే అంటున్నారు. అలా కాకుండా అవంతి గెలిచినా తక్కువ మెజారిటీ వస్తుందని అంటున్నారు. గంటాకు తొలిసారి ఓటమి శిష్యుడి చేతిలో ఓటమి ఎదురవుతోందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫలితాలు వచ్చేంతవరకూ ఉగ్గపట్టి చూడాల్సిన సీటుగా భీమిలీని అంతా పేర్కొంటున్నారు.