తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సందర్భంలో సీఈసీ షరతులు విధించడం గమనార్హం. షరతులకే లోబడే కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఈసీ స్పష్టం చేసింది. ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని రేవంత్ సర్కార్ మొదట నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో వుండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వం అభ్యర్థించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ సీఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. కేబినెట్ సమావేశాన్ని నిర్వహించుకోడానికి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని షరతులు విధించింది. అలాగే రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించొద్దని స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉన్నతాధికారులు కేబినెట్ భేటీలో పాల్గొన వద్దని షరతు విధించింది.
షరతుల నేపథ్యంలో సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా రుణమాఫీ కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తోంది. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ కేబినెట్ సమావేశంలో ఆ విషయమై చర్చించొద్దని సీఈసీ స్పష్టం చేసింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా షరతులు విధించినట్టు తెలిసింది. అలాగే జూన్ 2వ తేదీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పూర్తి అవుతుంది. దీంతో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకోడానికి తెలంగాణ సర్కార్ రెడీగా ఉంది. కానీ ఆ విషయమై కూడా కేబినెట్లో చర్చించొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొనడం విశేషం.