జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆచూకీ ఎక్కడ? ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. పిఠాపురంలో పోటీ చేసిన పవన్‌కల్యాణ్ ఈ దఫా ఎలాగైనా చట్టసభలో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. తనకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని ఆయన భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ఎన్నికల అనంతరం ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పిఠాపురంలో తనకు సహకరించిన టీడీపీ ఇన్చార్జ్ వర్మకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు మించి ఆయన నుంచి ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు లోకేశ్ కూడా ఎన్నికల ఫలితాలపై నోరు మెదపడం లేదు.
సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో లోకానికి తెలుసు. కానీ పవన్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదు. కొందరేమో అత్తింటి దేశం రష్యాకు వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎందుకో గానీ ఎన్నికల తర్వాత జనసేన సైలెంట్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎక్స్ వేదికగా వివాదాస్పద పోస్టు పెట్టి, అల్లు అర్జున్ అభిమానులతో చీవాట్లు తిన్నారు. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆ పోస్టును తొలగించినట్టు ప్రకటించారు. జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. మొత్తానికి పవన్‌కల్యాణ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.