విజయ్ చుట్టూ సమంత, సాయిపల్లవి?

ఈమధ్య ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఒక సినిమాను రవికిరణ్ కోలా దర్శకత్వంలో, మరో సినిమాను రాహుల్ సంకృత్యాన్ తో చేయబోతున్నాడు. వీటిలో రవికిరణ్ కోలాతో చేయబోయే సినిమా ఎక్కువగా…

ఈమధ్య ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఒక సినిమాను రవికిరణ్ కోలా దర్శకత్వంలో, మరో సినిమాను రాహుల్ సంకృత్యాన్ తో చేయబోతున్నాడు. వీటిలో రవికిరణ్ కోలాతో చేయబోయే సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం హీరోయిన్.

రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ ఇప్పటికే కథనాలు వచ్చాయి. గతంలో రంగస్థలం లాంటి రూరల్ సినిమాలో చేసిన అనుభవం ఉండడం ఒక కారణమైతే, శాకుంతలం టైమ్ లోనే సమంతకు దిల్ రాజు మాటిచ్చారనేది మరో కారణంగా చూపిస్తూ కథనాలు వచ్చాయి.

దీంతో ఖుషి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందంటూ ఊహాగానాలు చెలరేగాయి. అవి ఇంకా మార్కెట్లో నడుస్తుండగానే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది. ఆమె పేరు సాయిపల్లవి.

విజయ్ దేవరకొండ, సాయిపల్లవి కాంబినేషన్ లో రవికిరణ్ కోలా సినిమా ఉంటుందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ పాత్రకు సాయిపల్లవి కూడా సరిపోతుందని, విజయ్-సాయిపల్లవి కాంబో కూడా ఫ్రెష్ గా ఉంటుందంటూ కథనాలు మొదలయ్యాయి.

ఇలా సెట్స్ పైకి రాకుండానే ఈ సినిమాపై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజుకు ఇది 59వ చిత్రం. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా తీయాలనే ఆలోచనలో ఉన్నాడాయన.