సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. ఆస్తి కోసం వారసులు కొట్టుకునే ఉదంతాలు చాలానే చూశాం. కానీ ఇది మరింత దారుణం. ఎదురుగా తల్లి శవాన్ని పెట్టుకొని వారసులు కొట్టుకున్నారు. అలా అని మృతురాలు కోటీశ్వరురాలు అనుకుంటే పొరపాటే.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కందులవారి గూడెంకు చెందిన 80 ఏళ్ల లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. అందర్నీ ఉన్నంతలో బాగానే చూసుకుంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. కానీ వాళ్లు మాత్రం లక్ష్మమ్మ ప్రేమను చూడలేదు, ఆమె ఆస్తిని మాత్రమే ప్రేమించారు.
తల్లి చనిపోయిందని తెలుసుకున్న వెంటనే కూతుళ్లు, కొడుకు, కోడలు గ్రామానికి చేరుకున్నారు. తల్లి శవం ఉంటుండగానే ఆస్తి కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎంతకీ కొలిక్కిరాకపోవడంతో ఏకంగా పంచాయితీ పెట్టారు.
నిజానికి లక్ష్మమ్మ మరణించి 2 రోజులైంది. కానీ ఆస్తి వాటాలు లెక్క తేలకపోవడంతో తల్లి అంత్యక్రియలు చేయకుండా అలానే వదిలేశారు వారసులు. దీంతో స్థానికులు వీళ్లను చీదరించుకుంటున్నారు.
లక్ష్మమ్మ దగ్గర 21 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి, మరో 20 తులాల బంగారం ఉంది. వాటి కోసం కూతుళ్లు, కొడుకులు, కోడళ్లు కొట్టుకుంటున్నారు. ఆ తల్లి మృతదేహాన్ని అలానే గాలికొదిలేశారు. కలికాలం అంటే ఇదే.