ఎన్నికల తర్వాత ఏపీలో కొన్ని చోట్ల తీవ్రస్థాయిలో హింస చెలరేగింది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ, కూటమి శ్రేణుల మధ్య భారీగా గొడవలు జరిగే అవకాశం వుందనే చర్చకు తెరలేచింది. ఇదే విషయాన్ని కేంద్ర నిఘా సంస్థ పసిగట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం గమనార్హం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల అనంతరం గొడవలు జరగడం ప్రతి ఒక్కర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర నిఘా సంస్థ హెచ్చరిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రజానీకం కోరుకుంటోంది.
ఇప్పటికే ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కూడా ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర బలగాలను ఏపీలో మోహరించాలని కేంద్ర హోంశాఖను సీఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 19వ తేదీ వరకు కేంద్ర పోలీస్ బలగాలు భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. అందుకు తగ్గట్టు కేంద్ర సాయుధ బలగాలను భద్రత నిమిత్తం నియమించనున్నారు. పల్నాడు, తాడిపత్రి, పశ్చిమగోదావరి జిల్లా, అలాగే చంద్రగిరిలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలకు చోటు లేకుండా చర్యలు చేపట్టనున్నారు.