మోదీకి మ‌ళ్లీ అధికారంపై… తేడా కొడుతోందా!

ఎన్నిక‌ల షెడ్యూల్ రానంత వ‌ర‌కూ ప్ర‌ధాని మోదీ గ్రాఫ్ ఆహా ఓహో అనే టాక్ వినిపించింది. మ‌రీ ముఖ్యంగా అయోధ్య‌లో రామాల‌యం ప్రారంభంతో జాతీయ స్థాయిలో బీజేపీ వెలిగిపోతోంద‌నే భావ‌న క‌లిగింది. అలాగే అనేక…

ఎన్నిక‌ల షెడ్యూల్ రానంత వ‌ర‌కూ ప్ర‌ధాని మోదీ గ్రాఫ్ ఆహా ఓహో అనే టాక్ వినిపించింది. మ‌రీ ముఖ్యంగా అయోధ్య‌లో రామాల‌యం ప్రారంభంతో జాతీయ స్థాయిలో బీజేపీ వెలిగిపోతోంద‌నే భావ‌న క‌లిగింది. అలాగే అనేక స‌ర్వేల నివేదిక‌లు కూడా కేంద్రంలో మ‌ళ్లీ బీజేపీదే అధికారం అని చెప్పాయి. దీంతో ఇండియా కూట‌మిలో కూడా కాస్త నిరుత్సాహం క‌నిపించింది. 

అయితే మొద‌టి విడ‌త ఎన్నిక‌ల నుంచి బీజేపీకి వ్య‌తిరేకత ఎదురవుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ ప్ర‌చారం రానురాను పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ర‌చ్చ‌బండ‌ల వ‌ద్ద మోదీకి మ‌ళ్లీ అధికారం అనుమాన‌మే అని మాట్లాడుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర బీజేపీ బ‌ల‌మైన రాష్ట్రాల్లో ఈ ద‌ఫా ఆశించిన స్థాయిలో ఆ పార్టీకి సీట్లు రావ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

దీంతో బీజేపీ ఒంట‌రిగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశాలు లేవ‌ని అంటున్నారు. ప్రాంతీయ పార్టీల‌ను క‌లుపుకుని ఏ మేర‌కు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో చూడాల‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతోంది. మోదీ ప్ర‌భుత్వ మార్పును జ‌నం కోరుకుంటున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల ముస్లింల విష‌యంలో మోదీ యూట‌ర్న్ తీసుకోవ‌డం… బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతోంద‌నేందుకు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. 

ఎన్డీఏ కూట‌మికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాక‌పోతే, ఇత‌ర పార్టీలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌ద్ద‌తు ఇవ్వ‌వ‌నేది మెజార్టీ అభిప్రాయం. మ‌రోవైపు బీజేపీ మాత్రం 400 సీట్ల టార్గెట్ గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటోంది. అంత సీన్ లేద‌ని సామాన్య ప్ర‌జానీకం మాట‌. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాతే …మోదీపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రిచేలా ఓటింగ్ జ‌రుగుతోంద‌నే మాట వినిపిస్తోంది. ఇండియా కూట‌మిలో స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం వ‌ల్లే ఎన్డీఏ బ‌లంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

అయితే జ‌నం మాత్రం కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వంపై కొంత వ్య‌తిరేక‌త‌గా ఉన్నార‌ని సొంత పార్టీ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్టి, లొంగ‌తీసుకోడానికి ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేస్తుండ‌డ‌మే బీజేపీపై వ్య‌తిరేక‌తకు కార‌ణంగా ఎక్కువ మంది చెబుతున్నారు.  బీజేపీపై వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో వుందో తెలియాలంటే, వ‌చ్చే నెల నాల్గో తేదీ వ‌ర‌కు ఎదురు చూడాల్సిందే.