ఎన్నికల్లో గెలవడానికి నాయకులు ఎడా పెడా హామీలు ఇస్తుంటారు. వెనకా ముందు ఆలోచించరు. గెలిచి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరో ధ్యాస ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో చూసుకోరు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు ఎలా నెరవేర్చాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతుంటారు. కిందామీదా అవుతుంటారు. జుట్టు పీక్కుంటారు.
ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది. ఆరు గ్యారంటీల ప్రభావమో, కేసీఆర్ సర్కారు మీద వ్యతిరేకతోగానీ మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చున్నాడో లేదో హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ బీఆర్ఎస్ నక్షత్రకుడిలా తగులుకుంది. ఇతర హామీల సంగతి అలా పక్కన పెడితే రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ పైన గట్టిగా పట్టుకుంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మొన్నటివరకు అదే హడావుడి సరిపోయింది. రుణ మాఫీ ఏ విధంగా చేయాలని ఆలోచించుకునే సమయం కూడా రేవంత్ కు లేదు. అసలు గులాబీ పార్టీ నాయకులు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. వాళ్లకు ఎంతసేపటికీ కాంగ్రెస్ దిగిపోవాలని, తాము అధికారంలోకి రావాలనే కోరికే.
రుణ మాఫీపై రేవంత్ ను ఏదో విధంగా కమిట్ చేయించాలన్న పట్టుదలతో హరీష్ రావు సవాళ్ల మీద సవాళ్లు విసిరి రేవంత్ ను రెచ్చగొట్టాడు. అందులోనూ ఎన్నికల సమయం. రేవంత్ వెనక్కి తగ్గితే దాన్ని గులాబీ పార్టీ నాయకులు అడ్వాంటేజ్ గా తీసుకొని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారు. ఈ సంగతి తెలుసు కాబట్టి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని రేవంత్ సవాలుకు జవాబు ఇచ్చాడు.
రుణ మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికలో కూడా పోటీ చేయనని, మాఫీ చేయకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ చేశాడు. ఆరు నూరైనా రుణమాఫీ జరిగి తీరుతుందని, రాజీనామా లెటర్ రెడీగా జేబులో పెట్టుకోవాలని రేవంత్ హరీష్ కు చెప్పాడు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టాడు.
పోలింగ్ అయిపొయింది కాబట్టి రుణ మాఫీ పైన దృష్టి పెట్టాడు. కసరత్తు మొదలు పెట్టాడు. రేవంత్ ను గట్టెక్కించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. జుట్లు పీక్కుంటున్నారు. ఎందుకంటే రుణ మాఫీ చేయాలంటే దాదాపు 40 వేల కోట్లు అవసరం. అంత డబ్బంటే మాటలు కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అప్పుల మీదనే నడుస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు కట్టడానికి ఏడాదికి 62 వేల కోట్లు ఖర్చవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అయిదు నెలల్లోనే 17 వేల కోట్ల చిల్లర అప్పులు చేసింది. రేవంత్ చెప్పిన డెడ్ లైన్ తరుముకొస్తోంది. ఇప్పటి నుంచి మూడు నెలల సమయం మాత్రమే ఉంది. మిగతా హామీలు కూడా అమలు చేయాలి. ఒకవిధంగా చెప్పాలంటే రేవంత్ మెడ మీద కత్తి వేలాడుతోంది.
పంద్రాగస్టు నాటికి రుణ మాఫీ చేయకపోతే పరువు పోతుంది. గులాబీ పార్టీ, కాషాయం పార్టీలు నానా యాగీ చేస్తాయి. అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు. మూడు మార్గాలు చెబుతున్నారు. ఒకటి… కార్పొరేషన్ ఏర్పాటుచేసి రుణాలు ట్రాన్స్ఫర్ చేయడం. రెండోది … హైదరాబాదులో భూములను అమ్మడం. మూడోది… 30 వేల కోట్ల దీర్ఘకాలిక రుణం తీసుకోవడం. ఈ మార్గాల్లో ఏదో ఒకదాని ఫాలో కావాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేశాడు. భూములు అమ్మాడు. రేవంత్ కూడా అదే దారిలో నడుస్తాడు. అలవిమాలిన హామీలు ఇచ్చి గెలవడం ఆనందంగానే ఉంటుంది. గెలిచి అధికారంలోకి వచ్చాకే రోకటి పోట్లు పడతాయి.