టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి రౌడీయిజానికి హద్దు లేకుండా పోతోంది. చట్టానికి తాను అతీతం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులను భయాందోళనకు గురి చేసి, రాజకీయ లబ్ధి పొందాలని అతను మరోసారి ప్రయత్నించారు. ఈ దఫా ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన అనుచరుడిని బలవంతంగా తీసుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దౌర్జన్యం చేసిన చింతమనేని, అతని అనుచరులపై తాజాగా కేసు నమోదైంది.
చింతమనేనిపై ఇది 94వ కేసు అని తెలిసింది. ఎన్నికల రోజు కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్‌లోకి టీడీపీ నాయకుడు రాజశేఖర్ చొరబడి వైసీపీ కార్యకర్త రవిపై కత్తెరతో దాడికి తెగబడ్డాడు. అతనిపై పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి మూడు వాహనాల్లో తన అనుచరులతో పీఎస్‌కు వెళ్లాడు.
తమ కార్యకర్త రాజశేఖర్‌ను బలవంతంగా వెంట తీసుకెళ్లేందుకు చింతమనేని, అతని అనుచరులు ప్రయత్నించారు. సీఐ కొండవీటి శ్రీనివాస్, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై చింతమనేని దుర్భాషలకు దిగారు. చివరికి తమ నాయకుడిని చింతమనేని తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీస్‌శాఖ సీరియస్‌గా వుంది. చింతమనేని, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.
ఎన్ని కేసులు నమోదు అవుతున్నా చింతమనేని వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. రౌడీయిజం కూడా హీరోయిజంగా ఆయన భావిస్తున్నట్టున్నారు. అందుకే చట్టం, న్యాయం అనేవి వున్నాయని ఆయన గుర్తించడం లేదు. అంతా తన ఇష్టమన్న రీతిలో చింతమనేని దౌర్జన్యకాండకు తెరలేపారు. పోలీస్‌స్టేషన్‌కే వెళ్లాడంటే, ఇక సామాన్యుల విషయంలో అతను ఏ రకంగా ప్రవర్తిస్తారో అంచనా వేయొచ్చు.