ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం మాట‌లు కాదు!

ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఒక అభ్య‌ర్థికి ఓటు వేయ‌డానికి, అలాగే వేయ‌కుండా వుండ‌డానికి ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తారు. కులం, మ‌తం, ప్రాంతం, డ‌బ్బు, తాము అభిమానించే పార్టీ, అలాగే ముఖ్య‌మంత్రి…

ఎన్నిక‌ల్లో ఓట్లు వేయించుకోవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఒక అభ్య‌ర్థికి ఓటు వేయ‌డానికి, అలాగే వేయ‌కుండా వుండ‌డానికి ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తారు. కులం, మ‌తం, ప్రాంతం, డ‌బ్బు, తాము అభిమానించే పార్టీ, అలాగే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి త‌దిత‌ర అంశాల్ని ఓట‌రు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. వీటిలో మెజార్టీ అంశాల‌పై సంతృప్తి చెందితేనే ఓటు వేయ‌డానికి దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకుంటారు. 

రాజ‌కీయ రంగంలో రాణించాలంటే తేలిక కాదు. టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణే ఫెయిల్యూర్ అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. త‌న‌కు ల‌క్ష‌లాది మంది అభిమానులున్నార‌ని, కానీ ఓటు వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ వైపే మొగ్గార‌ని ప‌లు సంద‌ర్భాల్లో స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణే చెప్పిన సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త అభిమానం వేరు, ఓటు వేయ‌డానికి కార‌ణాలు వేరు. 

ఓటు వేయ‌క‌పోవ‌డానికి, అలాగే వేయ‌డానికి కొన్ని కార‌ణాలు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎదురింటోళ్ల‌కు నాలుగైదు సంక్షేమ ప‌థ‌కాలు అందుతుంటాయి. త‌న‌కు కేవ‌లం ఒక‌ట్రెండు ప‌థ‌కాలే అందుతున్నాయ‌నే కోపంతో ఇష్టం లేక‌పోయినా స‌రే ప‌క్క పార్టీకి ఓటు వేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంత‌కాలం త‌న‌కు ప్ర‌భుత్వం రెండు ప‌థ‌కాల‌కు ల‌బ్ధి క‌లిగించింద‌నే అభిమానం ఏ మాత్రం వుండ‌దు. త‌న‌కు త‌క్కువ‌, గిట్ట‌ని వారికి ఎక్కువ ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌లుగుతోంది కాబ‌ట్టి, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ప్ర‌భుత్వం రాకూడ‌ద‌ని ఆలోచించే మ‌న‌స్త‌త్వాలు లేక‌పోలేదు. ఇది ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. 

అలాగే సుదీర్ఘ కాలంగా తాము వ్య‌తిరేకించే కులానికి చెందిన వ్య‌క్తి పోటీ చేస్తున్నాడ‌ని, కాబ‌ట్టి త‌మ‌కు ఇష్టం లేక‌పోయినా ప్ర‌త్య‌ర్థి పార్టీకి ఓటు వేసిన వాళ్లు ఎంద‌రో. ఇంట్లో ఐదు ఓట్లు వుంటే, రెండు పార్టీల నుంచి డ‌బ్బు తీసుకున్న కార‌ణంగా …ఎక్కువ తాయిలాలు ఇచ్చిన పార్టీకి మూడు, త‌క్కువ ఇచ్చిన వారికి రెండేసి ఓట్లు చొప్పున వేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. 

అధికారంలో ఎవ‌రున్నా, ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా, వివిధ రూపాల్లో ఆర్థికంగా ఎంత ప్ర‌యోజ‌నం క‌ల్పించినా …ఓట్ల వేళ డ‌బ్బు ఇవ్వ‌నిదే, ఓట్లు వేయ‌ని వాస్త‌వ ప‌రిస్థితి. అందుకే ఓటుకు రేటు పెరిగింది. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం అల్లాట‌ప్పా కాద‌నేది నిజం. అందుకేనేమో ఓట‌రు మ‌హాశ‌యుల్ని దేవుళ్ల‌తో పోల్చుతున్న‌ది.