సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అంటే ఓ ముహుర్తం వుండేది. అది శుక్రవారం లేదా గురువారంతో మ్యాచ్ అయ్యేది. పైగా ముందు వెనుక ఏ సినిమాలు వస్తున్నాయి అనే లెక్కలు వుండేవి. అంతే కాదు, సినిమా ఎప్పుడు పూర్తవుతుంది అనే ఆలోచన కూడా వుండేది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు సినిమా విడుదుల అన్నది పూర్తిగా డిజిటల్ స్లాట్ మీద ఆధారపడి పోయింది.
అవును నిజం.. సినిమా రేంజ్ ను, నిర్మాతకు వున్న కాంటాక్ట్ లు, పరిచయాలను బట్టి డిజిటల్ అమ్మకాలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ఆధారపడిపోయింది. అలా అమ్మకాలు జరిగిపోయినా కూడా విడుదల డేట్ నిర్మాత చేతిలో వుండదు. డిజిటల్ కంటెంట్ తీసుకున్న వాళ్లు ఏ నెలలో, ఏ స్లాట్ లో ప్రసారం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవుతారు. దాన్ని బట్టి, కనీసం ఎన్ని వారాలు ముందుగా విడుదల చేయాలో డిసైడ్ కావాలి. అప్పుడు దానికి కాస్త అటు ఇటుగా డేట్ ఫిక్స్ చేసుకోవాలి.
కంటెంట్ రెడీగా వున్నా, డిజిటల్ అమ్మకాలు జరగకుంటే విడుదల డేట్ అన్నది సాధ్యం కాదు. ధైర్యం చేసి విడుదల తరువాత అమ్ముకుందాం అనుకుంటే గ్యారంటీ వుండదు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే సరే, డిజాస్టర్ అయితే అంతే సంగతులు. ఈగిల్ లాంటి సినిమా ఇలాంటి అనుభవమే నేర్చింది చాలా మందికి.
అందుకే ఇప్పుడు చాలా సినిమాలు ఫైనల్ కాపీ వరకు వచ్చి అలా పక్కన వున్నాయి. డిజటల్ అమ్మకాలు ఓ కొలిక్కి వస్తే, వాళ్లు ఎప్పుడు వేసుకుంటారో అన్నది చెబితే అప్పుడు విడుదల డేట్ వేసుకోవాల్సిన పరిస్థితిలో నిర్మాతలు చిక్కుకున్నారు. ఈ పరిస్థితి టాలీవుడ్ లో మాత్రమే కాదు, పక్కన వున్న కోలీవుడ్ లో కూడా వుంది. పదుల కొద్దీ సినిమాలు డిజిటల్ అమ్మకాలు లేక మూలుగుతున్నాయి.
తెలుగులో వరుసపెట్టి ఫ్లాపులు ఇస్తూ, హిట్ అన్నది చూడకపోయినా పది నుంచి పాతిక కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తగ్గించకుండా సినిమాలు చేస్తున్న హీరోల సినిమాలు పరిస్థితి కూడా ఇదే. ఇది తెలిసి కూడా నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. అడిగిన రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు. సినిమా పూర్తిచేసి పక్కన పెడుతున్నారు. విసిగి విసిగి ఎప్పుడో విడుదల చేస్తారు. కొంప కొల్లేరు చేసుకుంటారు.
హీరోల రెమ్యూనిరేషన్లు తగ్గే వరకు ఈ పరిస్థితి ఇలాగే వుంటుంది. డిజిటల్ అమ్మకాలు జరగవు. జరిగినా ఈ విడుదలకు ఆ రిలీజ్ కు మధ్య పెద్ద గ్యాప్ వుండదు. దీంతో లాభాలు పండించుకోవడం అన్నది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిపోతోంది.