తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం పూర్తి అయింది. రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని పోలింగ్ కేంద్రాలలో కచ్చితంగా రీ పోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఈసీ వాటిని ఖాతరు చేయలేదు. అంటే పోలింగ్ పర్వం సంపూర్ణంగా పూర్తయినట్లే లెక్క.
ప్రజలు ఓట్లు వేసే అవసరం తీరిపోయిన తర్వాత కూడా.. పచ్చ మీడియా ఇంకా నీచమైన ఏకపక్షపు రాతలను ఎందుకు రాస్తున్నది? ఇప్పటికైనా కొంచెం నిష్పాక్షికంగా జరిగింది జరిగినట్టుగా రాయవచ్చు కదా? ప్రజలను మభ్యపెట్టి, బయట ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్లుగా వారిని ఒక భ్రమలోకి నెట్టి.. తాము కొమ్ముకాస్తున్న తెలుగుదేశం పార్టీకి అనుచిత లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఇప్పుడు లేదు కదా..! ఇంకా నీచంగా ఏకపక్షంగా ఎందుకు రాస్తున్నారు.. అనేది ప్రజలకు అర్థం కాని సంగతి!
రాష్ట్రంలో పోలింగ్ పర్వం పూర్తయిన తర్వాత కూడా అనేకచోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోలింగ్ నాడు చెలరేగిన హింసాత్మక ఘటనలకు కొనసాగింపుగా నిన్న ఇవాళ కూడా ఘర్షణలు సాగుతున్నాయి. పోలీసులు వాటిని ఎక్కడికక్కడ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలను, అభ్యర్థులను కూడా గృహనిర్బంధంలోకి తీసుకొని.. గొడవలు ముదరకుండా చూస్తున్నారు. ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే శాంతి భద్రతలు ఉంటున్నాయి.
అయితే పచ్చ మీడియా మాత్రం ఇంకా మనశ్శాంతిని పొందినట్లుగా లేదు. రాష్ట్రాన్ని మరింత రావణకాష్టంగా మారిస్తే తప్ప వారికి ఉపశమనం కలిగేలా లేదు. వారి రాతలన్నీ ఇప్పటికీ ఏకపక్షంగానే సాగుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగితే.. దానిని ఘర్షణ అని రాస్తేనే అందం! దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన దాడిగా రంగులు పులిమి వార్తలు ప్రచురిస్తే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ఘర్షణలనూ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలుగా మసిపూసి మారేడు కాయ చేయాలని చూసే దుర్బుద్ధిని ఏం చేయాలి?
మీడియా కనీసం కొంత మేరకు అయినా బాధ్యతగా ఉండాలి. ప్రత్యేకించి ప్రజలలో విస్తృతమైన ఆదరణ ఉండే ప్రధాన స్రవంతి మీడియా సమాజ హితం కోసం మరింత బాధ్యతగా ఉండాలి. ఆ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నడో చేయి దాటిపోయింది. రాజకీయ పార్టీలకు ప్రలోభాల కారణంగా గాని, కులం కారణంగా గాని, ఇతర పార్టీల మీద ద్వేషం కారణంగా గాని తొత్తులుగా మారిపోవడం మీడియాకు అలవాటు అయింది. అనివార్యంగా జరిగిపోయిన ఆ పరిణామాన్ని ఇప్పటికిప్పుడు ఎవరూ మార్చగలిగేది లేదు.
అయితే ఎన్నికలలో పోలింగ్ జరిగే వరకు ఒక పార్టీకి కొమ్ము కాసినా సరే.. ఆ తర్వాతనైనా వార్తలు నిజాయితీగా ఇవ్వవచ్చు కదా అనేది ప్రజల కోరిక. ప్రధాన స్రవంతి మీడియా, పత్రికలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే మంచిది.