ఎన్నికలొచ్చాయంటే చాలు… ఒకప్పుడు రాయలసీమలో గొడవలే గొడవలు. ఫ్యాక్షన్‌ను ఎన్నికలు తిరగతోడేవి. దీంతో ఎన్నికలంటే సీమ వాసులు భయపడే పరిస్థితి. కానీ ఇప్పుడు ఏపీలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరులో, చంద్రగిరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో గొడవలు జరిగాయి.
కడప, కర్నూలు జిల్లాల్లో ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా జరిగాయి. చిన్నచిన్న గొడవలు మినహాయిస్తే, హత్యలకు దారి తీసే పరిస్థితులు ఎక్కడా లేవు. ఇది మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఏపీలో ప్రధానంగా పల్నాడులో తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ తీవ్రస్థాయిలో దాడులు, ప్రత్యర్థుల వాహనాల కాల్చివేత, గాలిలోకి పోలీసుల కాల్పులు యథేచ్ఛగా సాగుతున్నాయి.
పల్నాడులో ఎన్నికలకు ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసినప్పటికీ, శాంతిభద్రతలను నెలకొల్పడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు నష్టం జరిగిన తర్వాత, పోలీస్ అధికారులపై చర్యలతో తమ బాధ్యత తీరిపోయిందన్నట్టుగా ఈసీ వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. కూటమికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తూ, తమపై దాడులను ప్రోత్సహిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
పల్నాడులో పరిస్థితులు ఆందోళన కలిగిస్తుండగా, రాయలసీమలో ప్రశాంత వాతావరణం నెలకొనడం సంతోషాన్ని ఇస్తోంది. సీమలో ఫ్యాక్షన్ పూర్తిగా సమసిపోవడంతో గొడవలకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల్లో తాము అభిమానించే లేదా మద్దతు ఇచ్చే అభ్యర్థికి, పార్టీకి ఓటు వేసుకోవడానికే పరిమితం కావాలని, ఎవరి కోసమో మనమెందుకు గొడవ పడాలనే చైతన్యం సీమలో వెల్లువిరుస్తోంది.