ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కనీసం 10 నుంచి 12 సీట్లను సాధిస్తుందో అప్పుడు ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కుతుంది! అది ఉమ్మడి ఏపీలో అయినా, విభజన తర్వాతి ఏపీలో అయినా ఒక సంప్రదాయం లాంటిదే! తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలో గట్టి పునాదులున్నాయి. ఆ పునాదులపై ఆధారంగా అక్కడ టీడీపీ స్వీప్ చేసిన సందర్భాల్లో అధికారం దక్కడం, ఓ మోస్తరుగా సీట్లను సాధిస్తే మాత్రం అధికారం అందకపోవడం సంప్రదాయం!
2004లో తెలుగుదేశం పార్టీ 294 సీట్లకు గానూ 42 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా అందులో ఐదారు సీట్లు అనంతపురం జిల్లా నుంచినే వచ్చాయి! 2009లో టీడీపీ అనంతపురం జిల్లాలో సగం సీట్లను నెగ్గింది! అయితే అధికారానికి చాలా చాలా దూరంలో నిలిచింది! 2014లో అనంతపురం జిల్లాలో టీడీపీ 12 సీట్లతో స్వీప్ చేసింది! అప్పుడు ఆ పార్టీ వందకు పైగా సీట్లతో రాష్ట్రంలో అధికారంలో నిలిచింది. 2019లో ఆ పార్టీ అనంతలో చిత్తయ్యింది, రాష్ట్రంలో 23 సీట్లతో తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని నమోదు చేసింది!
అనంతపురంలో టీడీపీ పది నుంచి పన్నెండు సీట్లను సాధిస్తే తప్ప .. ఏపీలో అధికారం దక్కదు! అనంతలో సగం సీట్లు సాధించినా రాష్ట్రంలో టీడీపీకి అధికారం దక్కే ప్రసక్తి ఉండదు! ఇదీ దశాబ్దాల లెక్క! అనంతపురంలోనే టీడీపీ పై చేయి సాధించలేకపోతే, ఇంకెక్కడా సాధించలేదనేది చరిత్ర చెప్పే సత్యం!
మరి ఇప్పుడు నిజంగానే అనంతపురంలో పదికి పైగా అసెంబ్లీ సీట్లను సాధించే సీన్ ఉందా.. అంటే అంత లేదనే మాటే వినిపిస్తూ ఉంది! అనంతపురంలో టీడీపీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదనేది గ్రౌండ్ రిపోర్ట్! ఆ పార్టీకి కంచుకోటలన్నీ గత ఎన్నికల్లోనే బద్ధలయ్యాయి. అదెలా ఉన్నా.. ఇప్పుడు అనేక పొరపాట్లు, గ్రహపాట్లతో టీడీపీ అనంతలో స్వీప్ సంగతి అటుంచి, కనీసం ఐదారు అయినా సాధిస్తుందా అనే సందేహాలను రేపుతోందని పరిశీలకులు అంటున్నారు!
అనంతపురం, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బాగా వెనుకబడిందనే ప్రచారం జరుగుతూ ఉంది! ఈ ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తూ ఉంది! తాడిపత్రి, పుట్టపర్తి ల విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూల ధోరణి ఉందని అంటున్నారు! రాప్తాడు, మడకశిర, రాయదుర్గం, శింగనమలలో ముఖాముఖి పోరు ఉందని, ఫలితం ఊహలకు అందడం లేదని టాక్! ఎవరు నెగ్గినా అది స్వల్ప మెజారిటీలతోనే అనే ప్రచారం జరుగుతూ ఉంది!
పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ ల విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కి పూర్తి సానుకూలత ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది! మరి అనంతపురంలో ఆరేడు గెలిచినా రాష్ట్రంలో టీడీపీకి అధికారం అందని ద్రాక్షే! అలాంటిది ఇప్పుడు గట్టిగా ఐదు దక్కినా గొప్ప సంగతే అనే టాక్ వినిపిస్తోంది! అనంతలోనే ఐదంటే.. కూటమి శిబిరం ఆలోచించుకోవాలి మరి!