నెగెటివ్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

కొన్ని రోజుల కిందట విడుదలైన ఉప్పెన ట్రయిలర్ లో అన్ని ఎలిమెంట్స్ అందరికీ నచ్చాయి. ఒక్కటి తప్ప. అదే విజయ్ సేతుపతి పాత్రకు చెప్పిన డబ్బింగ్. సేతుపతికి ఆ డబ్బింగ్ సరిగ్గా కుదరలేదని చాలామంది…

కొన్ని రోజుల కిందట విడుదలైన ఉప్పెన ట్రయిలర్ లో అన్ని ఎలిమెంట్స్ అందరికీ నచ్చాయి. ఒక్కటి తప్ప. అదే విజయ్ సేతుపతి పాత్రకు చెప్పిన డబ్బింగ్. సేతుపతికి ఆ డబ్బింగ్ సరిగ్గా కుదరలేదని చాలామంది విమర్శించారు. అయితే ఆ కామెంట్స్ ను తిప్పికొడుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.

“ఉప్పెనలో తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పలేనని స్వయంగా విజయ్ సేతుపతి ఒప్పుకున్నారు. ఆ పాత్రకు తన వాయిస్ సూట్ అవ్వదన్నారు. ఆ తర్వాత చాలామందిని ట్రై చేశాం. నటుడు అజయ్ వాయిస్ అనుకున్నాం. గతంలో విజయ్ సేతుపతికి తెలుగులో డబ్బింగ్ చెప్పిన వాళ్ల వాయిస్ లు కూడా ట్రై చేశాం. వాళ్ల గొంతులేవీ నా సినిమాలో విజయ్ పాత్రకు సూట్ అవ్వలేదు.”

ఇలా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు రవిశంకర్ తో డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు బుచ్చిబాబు. విజయ్ సేతుపతి పాత్రకు రవిశంకర్ తో డబ్బింగ్ చెప్పించాలనే నిర్ణయాన్ని కావాలనే తీసుకున్నామన్నాడు.

“ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. ఎక్కడా సరదాగా కనిపించదు. ఆ పాత్రకు నార్మల్ వాయిస్ సరిపోదు. అందుకే రవిశంకర్ ను తీసుకున్నాం. ఆయన ఏ క్యారెక్టర్ కైనా డబ్బింగ్ పూటలో ఫినిష్ చేస్తారు. అలాంటి రవిశంకర్ కే డబ్బింగ్ చెప్పడానికి 3 రోజులు పట్టింది. 

పూటలో చెప్పేస్తాననే నమ్మకంతో టీషర్ట్ వేసుకొని బెంగళూర్ నుంచి వచ్చారు. విజయ్ సేతుపతి పాత్ర చూసి డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డారు. సాయికుమార్ ఇంటికెళ్లి బట్టలు తెచ్చుకొని, 3 రోజులు హైదరాబాద్ లోనే ఉండి డబ్బింగ్ చెప్పారు.”

ఇలా విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ చెప్పించడం వెనక చాలా ప్రహసనం నడిచిందని చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు. ఉప్పెనలో విజయ్ సేతుపతి భయపెడతాడని, ఆ పాత్రకు తన డబ్బింగ్ తో రవిశంకర్ వందశాతం న్యాయం చేశాడని నమ్మకంగా చెబుతున్నాడు. సినిమా చూసిన తర్వాత అందరి అనుమానాలు పటాపంచలైపోతాయని అంటున్నాడు.