బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టి నాలుగేళ్ళ నుంచి విశాఖ కేంద్రంగా చేసుకున్నారు. తన రాజకీయాన్ని అక్కడే అనుకుని ముందుకు సాగారు. ఈ మధ్యలో పండుగలు పబ్బాలతో పాటు తన పుట్టిన రోజు పండుగను కూడా వేడుకగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అయ్యారు.
టీడీపీ కూటమి ఏర్పాటు అయింది. పొత్తులో విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఖాయం అని అనుకున్నా అనేక కారణాలతో అది ఆయనకు దక్కలేదు. అయితే మొదట్లో కొంత బాధపడినా నెక్స్ట్ టైం బెటర్ లక్ అని జీవీఎల్ అనుకుంటున్నారు. తనకు టికెట్ దక్కకపోయినా విశాఖ వీడిపోను అని ఆయన అన్నారు.
ఆ ప్రకారమే ఆయన విశాఖలోనే మళ్ళీ తన రాజకీయ కార్యకలాపాలు మొదలెడుతున్నారు. ఆయన పుట్టిన రోజు జూలై 6. ఆ రోజున అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. గతసారి పుట్టిన రోజున కాబోయే ఎంపీ అని చాలా మంది కీర్తించారు. కానీ అది జరగలేదు. అయితే ఈసారి కూడా అంతే ఉత్సాహంతో జీవీఎల్ ముందుకు సాగుతున్నారు.
విశాఖ బీజేపీ సీటుగా ముద్ర పడింది. పొత్తులలో మళ్లీ ఈ సీటు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థానిక సమస్యల మీద స్పందిస్తున్న జీవీఎల్ కి ఈసారి అయినా లక్కు కలసి వస్తుందా అన్నది ఆయన అభిమానులు చర్చించుకుంటున్న విషయం.