పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి అనుచరులు దాష్టీకంపై వైఎస్సార్ జిల్లా నివ్వెరపోతోంది. వేంపల్లెలలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న అతనిపై విచక్షణా రహితంగా దాడి చేయడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లెలలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఎన్నికల రోజు వేంపల్లెలో బీటెక్ రవి చిన్నాన్న, మరికొందరు దౌర్జన్యానికి తెగబడ్డారని సమాచారం. వారిని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి కుమారుడితో పాటు అజయ్ అడ్డుకున్నారని తెలిసింది.
దీన్ని మనసులో పెట్టుకున్న బీటెక్ రవి చిన్నాన్న, మరికొందరు అనుచరులు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అజయ్‌పై దాడి చేయాలని కుట్రకు తెరలేపారు. స్థానికులైన వేంపల్లె టీడీపీ, కార్యకర్తలను అజయ్‌పై దాడికి బీటెక్ రవి చిన్నాన్న, ఇతర అనుచరులు పురమాయించారు. అయితే దాడికి వారు వెనుకంజ వేసినట్టు తెలిసింది. దీంతో వారే వేంపల్లెకు వెళ్లి, అజయ్‌పై ఇష్టమొచ్చినట్టు దాడికి తెగబడ్డారు.
దారిన వెళ్లే వారెవరో ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. దాడిలో గాయపడ్డ అజయ్‌ని ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్నారు. అన్యాయంగా దాడి చేయడంపై వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి.