ఎవరికే అన్యాయం జరిగినా …అదేంటోగానీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణే గుర్తు కొస్తున్నారు. పవన్ అన్నా మీరు రావాలి, మీరు స్పందించాలి …న్యాయం చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైంది. ఆ పాప ఏమైందో ఎవరికీ తెలియడం లేదు. నిందితులు రోజుకో మాట చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరడం విశేషం.
అలాగే జీపీఎస్ అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీన్ని జగన్ సర్కార్ తీసుకొచ్చింది. అప్పట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరికి మద్దతుగా టీడీపీ, జనసేన అగ్రనాయకులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఉద్యోగులు ఆత్మాభిమానంతో బతికేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పవన్‌కల్యాణ్ మరో రెండు అడుగులు ముందుకేసి , జగన్‌లా తాము మోసం చేసేది లేదని అన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ పథకం గురించి తాను అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని కూడా ఆయన అన్నారు. సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ పచ్చి మోసం చేసిందని, తాను న్యాయం చేస్తానని పదేపదే పవన్‌కల్యాణ్ అన్నారు.
అందుకే న్యాయం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆశగా పవన్‌కల్యాణ్ వైపు చూస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పవన్‌కల్యాణ్ మాటలు కోటలు దాటాయని, ఇప్పుడేమో ఆయన భాగస్వామ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం మళ్లీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్‌నే తీసుకొచ్చిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. కావున న్యాయం చేసేందుకు పవన్‌కల్యాణ్ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని, పవన్‌కల్యాణ్ వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పవన్‌కల్యాణ్ చక్కగా తాను మాటకు కట్టుబడి వుంటానని అనేక సందర్భాల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కేంద్రంగా పలువురు మాట్లాడుతున్నారు. పవన్‌కల్యాణ్ మాత్రం ప్రస్తుతానికి ఉలుకూపలుకూ లేకుండా ఉన్నారు.