అగ్రరాజ్యంలో హింసకు తావులేదంటూ బైడెన్ ప్రకటించినా.. అమెరికాలో హింసకు చోటు లేదంటూ ఉపాధ్యక్షురాలు ఖండించినా.. యూఎస్ లో గన్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అగ్రరాజ్యంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల తుపాకీ పేలుతూనే ఉంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.
అగ్రరాజ్య రాజకీయాలు కూడా దీనికి మినహాయింపు కాదు. అమెరికా చరిత్ర చూసుకుంటే, అబ్రహాం లింకన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు హత్యలు, హత్యాయత్నాలే కనిపిస్తాయి. ఇది ఇక్కడితో ఆగదు, ఏ స్థాయికి పోతుందో ఊహించడం కూడా కష్టమే.
19వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది అమెరికా అధ్యక్షులు, అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులపై హత్యయత్నాలు జరిగాయి. ఇది ఎదుర్కొన్న మొదటి అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్. అమెరికాకు ఏడో అధ్యక్షుడిగా పనిచేసిన ఆండ్రూ జాక్సన్ పై 1835, జనవరి 30న తుపాకీ కాల్పులు జరిగాయి. వాటి నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అమెరికా రాజకీయాల్లో జరిగిన తొలి కాల్పుల ఘటన అది.
అమెరికాలో నలుగురు సిట్టింగ్ ప్రెసిడెంట్స్ హత్యకు గురయ్యారు. వీళ్లలో అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ ముఖ్యులు. ఓ థియేటర్ లో నాటకం చూస్తున్న లింకన్ పై జాన్ విల్క్స్ బూత్ కాల్పులు జరిపాడు. 1865, ఏప్రిల్ 14న జరిగిన ఆ ఘటనలో లింకన్ అక్కడిక్కడే మృతిచెందారు.
తర్వాత అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని హత్య చేశారు. కమ్యూనిస్ట్ భావజాలంతో రగిలిపోయిన రూబీ ఓస్వాల్డ్ అనే వ్యక్తి.. 1963, నవంబర్ 22న కెనడీని హత్య చేశాడు. ఇక హత్యకు గురైన మిగతా ఇద్దరు ప్రెసిడెంట్స్.. జేమ్స్ గార్ ఫీల్డ్ (1881), విలియం మెకిన్లే (1901).
ఇలాంటి హత్యాయత్నాల నుంచి ముగ్గురు ప్రెసిడెంట్స్ తృటిలో తప్పించుకున్నారు. 1981లో రోనాల్డ్ రీగన్, 1912లో రూజ్ వెల్ట్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చావు అంచుల వరకు వెళ్లి బతికిపోయారు. ఈ అన్ని ఘటనల్లో తుపాకీలే ఉపయోగించారు. ఒక్క జార్జి బుష్ పై మాత్రమే ఏకంగా గ్రెనేడ్ తో దాడి జరిగింది. 2005లో జార్జియాలో బుష్ మాట్లాడుతుంటే, దుండగుడు గ్రెనేడ్ విసిరాడు. అదృష్టవశాత్తూ అది పేలలేదు.
తెరపైకి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు..
1901లో మెకెన్లే మరణం తర్వాత అమెరికా అట్టుడికిపోయింది. రాజకీయ నాయకులకు భద్రత లేదంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. అందులోంచి పుట్టుకొచ్చినదే అమెరికన్ సీక్రెట్ సర్వీస్. అప్పట్నుంచి పైకి కనిపించే నిఘా వ్యవస్థతో సమాంతరంగా పైకి కనిపించని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా పనిచేయడం మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు.
ఈ సంస్థ ఏర్పాటైన తర్వాత ఎన్నో హత్యయత్నాల్ని సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్నారు. వీళ్లు ఇచ్చే ఇన్ పుట్స్ ఆధారంగా ఎంతోమంది అధ్యక్షులు తమ టూర్ షెడ్యూల్స్ మార్చుకున్నారు. అయితే ట్రంప్ విషయంలో మాత్రం సీక్రెస్ సర్వీస్ ఫెయిలైందనే విమర్శలు మొదలయ్యాయి. ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినప్పటికీ, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తుపాకీ పేలిన వెంటనే స్పందించింది ఈ ఏజెంట్లే. హత్యయత్నం చేసిన వ్యక్తిని కాల్చిచంపింది కూడా ఈ ఏజెంట్లే.