రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా వెలిగి పోతారో, ఎప్పుడు ఎవరు పాతాళానికి పోతారో తెలియదు. ఇదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. వారు తలచుకుంటే ఎవరి జాతకాలైనా మారిపోతాయి. మొన్నటివరకు రాజకీయాలకు పనికిరాడని, పార్ట్ టైం పోటీషియన్, ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడని ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న, గతంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం.
చంద్రబాబు తరువాత రెండో ప్లేస్ లో ఉన్నాడు. కీలకమైన శాఖలు చూస్తున్నాడు. బాబు నాలుగైదు శాఖలను ఆయనకు అప్పగించాడు. పవన్ మంత్రి పదవికి పూర్తిగా కొత్త కాబట్టి అయోమయంగానే ఉంది. సభల్లో సమస్యల మీద మాట్లాడటం వేరు. విమర్శలు చేయడం వేరు. మంత్రిగా వాటిని గురించి తెలుసుకోవడం వేరు. వాటిని స్టడీ చేయడం వేరు.
వాటిని అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి. వాటికి పరిష్కారాలు ఆలోచించాలి. అధికారులకు దిశానిర్దేశం చేయగలగాలి. సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అధికారులు ఇచ్చే అనేక ఫైల్స్ చదవాలి. గవర్నమెంటు వ్యవహారాలన్నీ ఇంగ్లిష్ లోనే ఉంటాయి. వివిధ శాఖలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ఉంటుంది. ఇదంతా అర్ధం చేసుకోవడం కష్టం.
అధికారులను కూలంకషంగా అడిగి తెలుసుకోవాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. కొత్త మంత్రులకు అధికారులే గురువులుగా మారతారు. కాబట్టి విద్యార్థులుగా మారక తప్పదు. మంత్రినని విర్రవీగకూడదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా తనకు కేటాయించిన శాఖలను స్టడీ చేయడంలో మునిగిపోయాడని తెలుస్తోంది. ఇన్నేళ్లు సినిమా స్టోరీలను, స్క్రిప్ట్ లను అర్ధం చేసుకొని నటించిన పవన్ ఇప్పుడు ఫైల్స్ చదివి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడట.
దీంతో తాను మంచిగా చదువుకొని ఉంటే బాగుండేదని అనుకుంటున్నాడట. కనీసం డిగ్రీ అయినా చదువుకొని ఉండాల్సింది అనుకుంటున్నాడట. మరి ఇలా రాజకీయాల్లోకి వస్తానని, మంత్రిని అవుతానని ఆయన అనుకోని ఉండడు. అలాంటి ఆలోచన ఉంటే టెన్త్ క్లాస్ తో ఆగిపోయి ఉండేవాడు కాదేమో. ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో తన క్వాలిఫికేషన్ టెన్త్ అని తెలియచేశాడు.
వాస్తవానికి చదువుకు, మంత్రి పదవికి సంబంధం లేదు. ఫలానా కోర్సు లేదా ఫలానా డిగ్రీ ఉంటేనే మంత్రి పదవి వస్తుందనే రూల్ రాజ్యంగంలో లేదు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన జలగం వెంగళరావు పెద్దగా చదువుకోలేదు. కానీ సమర్ధుడైన సీఎంగా పేరు తెచ్చుకున్నాడు. అక్షరం ముక్క రాని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మంత్రిగా సమర్ధంగా పని చేయాలి. ప్రతిభ నిరూపించుకోవాలి. అంతే తప్ప తాను పెద్దగా చదువుకోలేదని బాధపడటం అనవసరం.