అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీన్నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. అతడి కుడిచెవి పై నుంచి తూటా దూసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ కిందకు వంగారు. ఆ వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఓ అగంతకుడ్ని మట్టుబెట్టింది.
ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఎఫ్ బీ ఐ గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బథల్ పార్క్ కు చెందిన థామస్ మాథ్యూ క్రూక్. అతడి వయసు జస్ట్ 20 ఏళ్లు. ఇతడే ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే తన ప్రాణాలు కోల్పోయాడు.
ఏఆర్ 15 రకానికి చెందిన ఆటోమేటిక్ రైఫిల్ తో థామస్ కాల్పులు జరిపినట్టు ఎఫ్ బీ ఐ ప్రకటించింది. ఇతడు ఎందుకు కాల్పులు జరిపాడు, ఇతడి వెనక ఎవరున్నారు.. కుటుంబ నేపథ్యం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, థామస్ వల్ల ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
ట్రంప్ కోసం 3 రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించాడు థామస్. సీసీటీవీ కెమెరాల ఫూటేజ్ ఆధారంగా ఈ విషయాన్ని నిర్థారించారు. 300 అడుగుల దూరంలో ఉన్న బిల్డింగ్ ను ఎంచుకున్నాడు. అక్కడ్నుంచి ట్రంప్ పై కాల్పులు జరిపాడు. గురి తప్పడంతో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ముందుగానే హెచ్చరించిన ప్రత్యక్ష సాక్షి…
నిజానికి ఈ ప్రమాదం కూడా జరగకుండా ఆపే అవకాశం పోలీసులకు వచ్చింది. ట్రంప్ ప్రసంగానికి ముందు ఓ వ్యక్తి ఎదురుగా ఉన్న ఓ భవనం పైకి ఎక్కుతున్నట్టు ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు. ట్రంప్ వచ్చేసరికి అంతా సర్దుకుంటుందని అతడు భావించాడు.
కానీ ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటల్ని పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ల నిర్లక్ష్యానికి మూల్యమే ఇది. భవనం పైకి ఎక్కిన థామస్, నేరుగా ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ బయటపడినప్పటికీ మరో ఇద్దరు మరణించారు.