ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికి, కుళ్లబొడవడానికి, చీల్చి చెండాడడానికి కొన్ని పార్టీలకు కొన్ని సజెక్టులు ఉంటాయి. ఏళ్ళు గడిచినా వాటిని వదలవు. బీజేపీకి కాంగ్రెస్ బద్ధశత్రువు కదా. ఆ పార్టీని ఎదగనివ్వకూడదనే ఎప్పుడూ దాని ఆలోచన. ఎప్పుడూ నెహ్రు విధానాలను విమర్శిస్తూనే ఉంటుంది. ఆయన తప్పులను ఇప్పటీకీ ఎత్తి చూపుతూనే ఉంటుంది.
ఇక ఈ పార్టీకి ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ. తాజాగా ప్రతి ఏడాది జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని మోడీ సర్కారు గెజిట్ జారీ చేసింది. అంటే దేశ ప్రజలు ప్రతి ఏడాది ఎమర్జెన్సీని గుర్తు చేసుకొని బాధపడి కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకోవాలనేది మోడీ అండ్ అమిత్ షా ఉద్దేశం.
నిజమే.. ఎమర్జెన్సీ ఒక పీడ కలే. మాయని మచ్చే. కానీ ఆ అధ్యాయం ముగిసింది కదా. దాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం ఎందుకు? ఎమర్జెన్సీని చూసిన తరంలోని వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎమర్జెన్సీని గుర్తు చేయడం బీజేపీ రాజకీయ వ్యూహం తప్ప మరొకటి కాదు. ఎమర్జెన్సీ విధించే అవకాశం రాజ్యాంగమే ఇచ్చింది.
దాన్ని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉపయోగించుకుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాకపొతే అప్పట్లో అరాచకాలు విపరీతంగా జరిగాయి. కొంతమేరకు మంచి కూడా జరిగిందనే వారు ఉన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో క్రమ శిక్షణ వచ్చిందని, పనులు వేగంగా జరిగాయని, ఉద్యోగులు, అధికారులు వేగంగా పనిచేశారని చెబుతారు.
కొంత మంచి జరిగిందనే వారున్నారు. ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ ఓడిపోయినా జనతా ప్రభుత్వం కూలిపోయిన తరువాత ఆమె మళ్ళీ దేశ ప్రధాని అయ్యారు. ఈ కలగూర గంప పార్టీల పాలన కంటే ఆమె పాలనే బెటర్ అనుకున్నారు. చివరకు ఆమె దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.
బంగ్లా దేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేసినప్పుడు బీజేపీ నాయకుడు వాజపేయి ఇందిరను అపార దుర్గా దేవిగా కీర్తించారు. ఇప్పుడు ఎమెర్జెన్సీ విధించకపోయినా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి కదా. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నాడని విమర్శలు ఉన్నాయి కదా. కాబట్టి మానిపోయిన పండును గెలుక్కోవడం ఎందుకు?