ఇక అంతా మంచి కాలమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారు. దీనికి కారణం ఏపీలో అధికార మార్పిడే అనేది ఆయన అభిప్రాయం. ఏ పార్టీ అయినా తమ పాలనలో అంతా మంచే జరుగుతుందని భావిస్తుంటుంది. అయితే ఎన్నికల్లో గెలుపోటములే కీలకం. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు కీలక కామెంట్స్ చేశారు.
మంచి పనులు చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక మీదట చిరునామాగా వుంటుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో మంచి చేయాలని అనుకున్న వారికి అడ్డుకట్టలు, విధ్వంసం అనేవి వుండవని ఆయన స్పష్టం చేశారు. మంచి చేయాలని ఎవరైనా అనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభించిన స్ఫూర్తితోనే నాడు 203 అన్న క్యాంటీన్లు శ్రీకారం చుట్టారన్నారు.
సమాజంలో శాంతి నెలకొనడానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో దోహదం చేస్తుందని చంద్రబాబు అన్నారు. ఆధ్యాత్మిక సేవా కేంద్రాలు లేకపోతే ఇప్పుడుండే జైళ్లు, ఆస్పత్రులు కూడా సరిపోనంతగా నేరాలు పెరిగిపోతాయన్నారు. దైవసేవతో పాటు మానవసేవను హరేకృష్ణ సంస్థ సమానంగా చూస్తోందన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మికత సేవను కొనసాగించాలని చంద్రబాబు కోరారు.